Sep 20,2023 21:56

సదస్సులో మాట్లాడుతున్న డిఎస్‌పి మురళీధర్‌

ప్రజాశక్తి - సాలూరు : పట్టణంలోని పలు చోట్ల ఏర్పాటు చేసిన వినాయక మండపాలకు సంబంధించి నిమజ్జనం కార్యక్రమాల నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలని డిఎస్పీ మురళీధర్‌ చెప్పారు. మంగళవారం సాయంత్రం శివాలయం వీధిలో ఉన్న సీతారామ ధర్మశాలలో వినాయక నిమజ్జనాలపై సంబంధించిన కమిటీ సభ్యులు, పట్టణ పెద్దలకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కమిటీ సభ్యులు, పెద్దలే చర్యలు తీసుకోవాలని కోరారు. ఊరేగింపుల్లో డిజె సౌండ్స్‌ వినియోగించరాదని సూచించారు. ఎప్పుడు,ఏ మార్గం గుండా నిమజ్జనం చేయనున్నారో కమిటీ సభ్యులు ముందుగా తెలియజేయాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో టౌన్‌ సిఐ సిహెచ్‌.శ్రీనివాసరావు, ఎస్‌ఐ భాస్కరరావు పాల్గొన్నారు.