అర్ధరాత్రి పూసే పూలు, బాటిల్ వాష్ చేసే బ్రెష్‌లాంటి పూలు, పౌడర్‌పఫ్ లాంటి పూల గురించి మీరెప్పుడైనా విన్నారా? ఉడతలు, సీతాకోక చిలుకలు, రామచిలుకలు సైతం ఏ పండు కోసం పోటీపడతాయో తెలుసా? తేనెలా మధురంగా ఏ ఫలముంటుందో చెప్పగలరా? ఇలాంటి కొన్ని వింతైన పువ్వులు.. విడ్డూర ఫలాల పరిచయమే
ఈ వారం విరితోట...
పౌడర్ పఫ్ మొక్కలు
ఈ మొక్కలు నాలుగైదు అడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి. వీటిని 'కలియాండ్రా ప్లాంట్స్' అనీ అంటారు. వీటి పువ్వులు పౌడర్ పఫ్‌లా ఉంటాయి. ఎర్రని కేసరాలతో పువ్వులు నాజూగ్గా, అందంగా ఉంటాయి. వీటి పువ్వులు గాలికి ఊగుతూ ఉంటే భలే అందంగా ఉంటాయి. ఇవి ఇంటి పెరట్లో నేల మీద వేసుకోవడానికి అనువుగా ఉంటాయి. పౌడర్‌పఫ్ మొక్కలు వాతావరణాన్ని బట్టి పువ్వులు పూస్తాయి. అన్ని నేలల్లోనూ పెరుగుతాయి.
భళా ! జంభో ఫలా
చప్ప చప్పగా, తియ్య తియ్యగా ఉండే ఫలాలు జంభోఫలాలు. వేసవి సీజన్లో ఇవి బాగా కాస్తుంటాయి. మినరల్స్ అధికంగా ఉండే ఈ కాయలు ఎంతటి దాహాన్నైనా తీరుస్తాయి. జంభో ఫలాలు ఎర్రగా నిగనిగలాడుతూ కను విందూ చేస్తాయి. ఈ మొక్క 12 అడుగుల చెట్టు అవుతుంది. నాటిన రెండో సంవత్సరం నుంచే కాపు మొదలవుతుంది. ఉడుతలు, సీతాకోక చిలుకలు, రామచిలుకలు ఈ కాయల కోసం చెట్టు మీద వాలి, పోటీపడుతూ ఉంటాయి. వీటిని గులాబీ జామకాయలు, వాటర్ యాపిల్స్ అనీ పిలుస్తారు. ఈ మొక్కలు నల్లరేగడి నేలలో ఏపుగా పెరుగుతాయి. తెలుపు, లేత ఆకుపచ్చ, చింతపిక్క రంగుతోపాటు మల్టీకలర్స్‌లో కాయలు కాసే మొక్కలూ ఇటీవల కడియం నర్సరీల్లో అందుబాటులోకి వచ్చాయి.
మే ఫ్లవర్
లిల్లీ జాతికి చెందిన ఈ మొక్క అడుగున్నర నుంచి రెండడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. మే నెల రాగానే ఎర్రటి బంతుల్లాంటి పువ్వులు పూస్తుంది. అందుకే వీటిని 'మే ఫ్లవర్స్' అంటారు. ఒక్కో పువ్వు నాలుగైదు రోజుల వరకూ తాజాగా ఉంటుంది. మే నెలలో వాతావరణం ఎండలు ఠారెత్తి స్తూ ఉంటే ఈ పూబంతులు మరో ప్రచండ భానుడిలా కనిపిస్తాయి. సన్నటి కేసరాల్లాంటి పూ రేఖలు మే ఫ్లవర్స్‌కు హొయలు అద్దుతాయి. వీటిని కుండీల్లోనూ, నేల మీదా పెంచుకోవచ్చు. ఈ మొక్కలకు పెద్దగా నీటి వనరు అవసరం లేదు. కొన్నిచోట్ల మేడే రోజున ఈ పూలు వికసించి, అరుణపతాక రెపరెపల్లా కనిపిస్తాయి. మే ప్లవర్ సంవత్సరంలో కేవలం మే నెలలోనే పువ్వులు పూస్తాయి.
బాటిల్ బ్రెష్
చూడ్డానికి అచ్చంగా బాటిల్ వాష్ చేసే బ్రెష్‌లాగా ఉంటుంది పువ్వు. అందుకే వీటిని బాటిల్ బ్రెష్ అంటారు. ఒక కాడకి ఎర్రని కేసరాల్లాంటి రేకులు, చివర పుప్పొళ్ళు ఉంటాయి. దీని శాస్త్రీయ నామం కెలెస్ట్రోమెన్. ఈ మొక్క 20 నుంచి 25 అడుగుల ఎత్తు వరకూ పెరిగి, చెట్టుగా మారుతుంది. చక్కటి నీడనీ ఇస్తుంది. సంవత్సరం పొడుగునా అప్పుడొక పువ్వు.. అప్పుడొక పువ్వు మాత్రమే పూస్తుంది. కానీ వేసవిలో మాత్రం చెట్టు నిండుగా పువ్వులు పూసి, సువాసనలు వెదజల్లుతాయి. ప్రస్తుతం మార్కెట్లో రెండు నుంచి మూడడుగుల ఎత్తు వరకూ పెరిగే హైబ్రిడ్ మొక్కలూ అందుబాటులోకి వచ్చాయి. వీటి మొక్కలు గుబురుగా ఉంటూ ఆకులు పసుపు రంగులో ఉంటాయి. వీటిని గార్డెనింగ్‌లో పెన్సింగ్‌గా వాడతారు.
అపురూపం బ్రహ్మ కమలం
చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ.. ధవళ వర్ణ కాంతులు విరజిమ్ముతూ.. సుగంధ పరిమళాలు వెదజల్లే విశిష్ట కుసుమ పరాగం బ్రహ్మకమలం. ఏడాదికి కొద్దిరోజులు మాత్రమే పూస్తుంది. అదీ అర్ధరాత్రి వేళ. పూసిన నాలుగైదు గంటల్లోనే పువ్వు వాడిపోతుంది. అరచేతి పరిమాణంలో తెలుపు మెరుపుతో పువ్వు ఎంతో శోభాయమానంగా ఉంటుంది. పువ్వు విచ్చుకున్న తర్వాత కొంతదూరం వరకూ సువాసనలు వెదజల్లుతూనే ఉంటాయి. ఎపీలియం ఆక్సీపెటలం (జుజూఱజూష్ట్రyశ్రీశ్రీబఎ ఉఞyజూవ్aశ్రీబఎ) దీని శాస్త్రీయ నామం. ఇది సెమీ కాక్టస్ జాతి మొక్క. ఈ మొక్క సన్నని పొడవాటి ఆకులతో దళసరిగా ఉంటుంది. ఇది హిమాలయాల కొండలపై పెరిగే మొక్క. ఏడాదిలో శీతాకాలం రాత్రివేళ నాలుగైదు సార్లు మాత్రమే పూస్తుంది. ఈ మొక్కకు పెద్దగా నీటి వనరు అవసరం లేదు.
అగ్గిపుల్లల పువ్వు
అగ్గిపుల్లలు ఒక కాడకి గుచ్చినట్టుండే రంగు రంగుల గొట్టాల్లాంటి రేకలు ఉండే పువ్వుల మొక్క 'జకోబినా'. దీనిది ఒక గమ్మత్తయిన అందం. రెండడుగుల ఎత్తువరకూ పెరిగే ఈ మొక్క శీతాకాలం సీజన్లో పువ్వులు పూస్తుంది. లేతగులాబీ రంగు కాడకి ఒక చివర నీలంరంగు టోపి ఉన్నట్లు ఈ పువ్వులు ఉంటాయి. జకోబినా మొక్కకు పువ్వులు గుత్తులు, గుత్తులుగా వేలాడుతూ ఎంతో ఆకర్షణీయంగా కాంతులీనుతుంటాయి. ఇది శీతలదేశపు మొక్క. వీటిని కుండీల్లో పెంచుకోవడం సులభం.
ఎర్ర సీతాఫలాలు
సీతాఫలం అంటేనే ఎంతో మధురం. ఈ సరికొత్త సీతాఫలం తేనె జుర్రి వేసినట్టు మహా మధురంగా ఉంటుంది. వీటి కాయ ముదురు ఎరుపు రంగులో నవనవలాడుతూ ఉంటుంది. ఒకసారి దీని రుచి చూసిన వాళ్ళకి ఎర్ర సీతాఫలం చూడగానే నోరూరుతుంది. ఈ చెట్టు ఐదడుగుల ఎత్తు వరకూ పెరిగి, కాయలు కాస్తుంది. సాధారణ సీతాఫలాలతో పోలిస్తే వీటి కాపు కొంచెం తక్కువే. వర్షాకాలం మధ్య నుంచి కాపు మొదలై, శీతాకాలం మధ్యకు వచ్చేసరికి ముగుస్తుంది. ఇది ఇంటి పెరటిలో వేసుకోవడానికి అనువైన మొక్క. ఎర్రనేలలో ఏపుగా పెరుగుతాయి.