Feb 27,2022 13:12

వర్ణ వయ్యారాలు ఒలకబోస్తూ... చిరునవ్వులు చిందిస్తూ.. పరిమళాలు గుప్పిస్తూ.. పులకించే పువ్వులు హృదయ వదనాలు. మొక్కల మొవ్వుల్లోంచి దూటలు బయలుదేరి, గెలలు మాదిరిగా విరులు విచ్చుకునే.. అపురూప జాతి పూల మొక్కలు గెల పూల మొక్కలు. ఆ అరుదైన మొక్కల గురించే ఈ పరిచయం.. గెల పూల మొక్కలు ఆర్నమెంటల్‌ రకానికి చెందినవి. ఒక్కో మొక్కా ఒక్కో విలక్షణాన్ని సంతరించుకుని, ఒక్కో ప్రాంతాల్లో వర్ధిల్లుతున్నాయి. వాటి గురించి మరింత లోతుగా తెలుసుకుందాం..


                                                                          అల్పినియా పర్పురాటా ..

 అల్పినియా పర్పురాటా ..

ఈ మొక్క రెండు నుంచి నాలుగడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. ఆకులు చిన్నసైజు అరటి ఆకుల్లా ఉంటాయి. మధ్యలో ఒక గెలలాంటి పువ్వు ఒకటి వస్తుంది. అది 10 నుంచి 12 అంగుళాల వరకూ ఉంటుంది. పువ్వు ఆకులు ముదురు గులాబీ రంగులో చాలా దళసరిగా ఉంటాయి. ఈ మొక్క పువ్వు దూరానికి ఒక బల్బు వెలుగుతున్నట్లుగా కనిపిస్తూ అందంగా ఉంటుంది. పువ్వును కోయకుండా ఉంచితే, మూడు నెలల వరకూ వాడిపోకుండా ఉంటుంది. ఒకవేళ పువ్వును కోసినా పది రోజుల వరకూ నిగారింపుగా ఉంటాయి. అందుకే వీటిని కట్‌ ఫ్లవర్స్‌లో డెకరేషన్‌కి వాడతారు. ఈ మొక్కని మన తెలుగులో ఎర్ర అల్లం అని పిలుస్తారు. ఇంకా ఉష్ట్రపక్షి ప్లూమ్‌, పింక్‌ కోన్‌ అల్లం అని కూడా పిలుస్తారు. ఇవి మలేషియా ప్రాంతానికి చెందినవి. వీటికి తేమ, నీటి వనరు ఎక్కువ అవసరం. కాస్త నీడలోనూ, ఎండలోనూ పెరుగుతాయి. వీటిని కుండీల్లోనూ పెంచుకోవచ్చు.

                                                                              లుపినస్‌ పాలీఫిల్లస్‌ ..

లుపినస్‌ పాలీఫిల్లస్‌ ..

ఇవి ఉత్తరమెరికాకి చెందిన పూలమొక్కలు. తేమ ప్రాంతాల్లోనూ, నీటి ప్రవాహాల వెంబడి బాగా పెరుగుతాయి. ఆకులు గుజ్జుగా ఉండి, మధ్యలోంచి పూలట్రిగ్‌ వస్తుంది. ఈ పూలగుచ్చం గోపురాకారంగా ఉంటుంది. పూరేకలు విభిన్న పరిమాణాల్లో దళసరిగా అందంగా ఉంటాయి. అడుగుభాగంలోని రేకలు నీలి రంగులోను, పైభాగం రేకలు గోధుమ, లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పువ్వు చాలా గమ్మత్తుగా పై రేకలు నీలి రంగులో మారుతుంటే.. కింది రేకలు రాలిపోతుంటాయి. మొత్తానికి ఒక్కో పువ్వు ఆరు నెలల వరకూ విచ్చుకుని ఉంటుంది. ఐదడుగులు ఎత్తువరకూ పెరిగే వీటిని కుండీల్లోనూ పెంచుకోవచ్చు.

                                                                             టిల్లాండ్సియా సైనేయా ..

  టిల్లాండ్సియా సైనేయా ..

సాధారణంగా పింక్‌ క్విల్‌ అని పిలవబడే టిల్లాండ్సియా సైనేయా సతతహరితారణ్య మొక్క. దీని ఆకులు సన్నగా, పొడవుగా గట్టిగా ఉంటాయి. మొవ్వు భాగం నుంచి పువ్వు గెల వస్తుంది. అది ముదురు పింకు రంగులో ఉంటుంది. దాని మధ్యభాగంలోంచి ఒక వయొలెట్‌ రంగు పించంలాంటి పువ్వొకటి వస్తుంది. మొత్తం మీద పువ్వు ఒక పడగలా, నెమలి పించంలా ఎంతో అందంగా ఉంటుంది. పువ్వు గెల చాలా రోజులు ఉంటుంది. కానీ వయొలెట్‌ పువ్వు మాత్రం మూడు రోజుల్లో వాడిపోతుంది. మొక్క నాటిన రెండేళ్ల తరువాత పువ్వులు గుత్తులు, గుత్తులుగా పూస్తాయి. నీరు ఎక్కువైతే మొక్క కుళ్ళిపోయి చనిపోతుంది. కాబట్టి నీటిని సమానంగా వాడాలి. మొక్క ఎండలో బాగా పెరుగుతుంది. కానీ తీవ్రమైన ఎండలో ఆకులు మాడిపోతాయి. కొబ్బరిపొట్టులో మొక్కలు బాగా పెరుగుతాయి.

                                                                               కాలిమోనస్‌ సిట్రినస్‌ ..

కాలిమోనస్‌ సిట్రినస్‌ ..

కాలిమోనస్‌ సిట్రినస్‌ అనేది ఆస్ట్రేలియా జాతి మొక్క. దీనికి సన్నని, చిన్న చిన్న ఆకులు ఉంటాయి. కొమ్మల చిగురున సన్నని కేసరాల్లాంటి రేకలు చుట్టూతా ఉంటాయి. దీని పువ్వు చూడ్డానికి సీసాలు తోమే కుచ్చులా ఉంటుంది. అందుకే వీటిని 'బాటిల్‌ బ్రష్‌' అని కూడా పిలుస్తారు. ఇందులో ముదురు ఎరుపు, తెలుపు రంగు పువ్వులు పూసే రకాలు ఉన్నాయి. అలాగే కుండీల్లో నాలుగడుగుల్లోనే పువ్వులు పూస్తాయి. 20 అడుగులు ఎత్తు వరకూ వృక్షాలు మాదిరి పెరిగే వెరైటీ మొక్కలు కూడా ఉన్నాయి. టాల్‌ వెరైటీని నీడ కోసం ఉపయోగిస్తారు. సంవత్సరంలో ఆరు నెలలు పువ్వులు పూస్తాయి.

                                                                                గొంపెర్న గోబాస ..

 గొంపెర్న గోబాస ..

మొక్క రెండడుగులు ఎత్తు వరకూ పెరుగుతుంది. సన్నని ట్రిగ్‌ వచ్చి దానికి చివర భాగంలో పువ్వు విచ్చుకుంటుంది. పువ్వు దళాలు గట్టిగా ప్లాస్టిక్‌లా మెరుస్తూ ఉంటాయి. ఇందులో రంగులు కూడా ఉంటాయి.

 

                                                                              ప్రిములా వియాలి ..

 ప్రిములా వియాలి ..

ఇది చాలా అద్భుతమైన మొక్క. ఇది నిటారుగా పోకర్‌ ఆకారంలో, ఎరుపు గులాబీ పువ్వులను పూస్తుంది. వేసవిలో ఈ పువ్వులు విచ్చుకుంటాయి. పాక్షికమైన నీడ, నీటి పారుదల లేని నేలలో పెరగడానికి ఇది సరైనది. గార్డెన్‌, చెరువు అంచుల వద్ద, పార్కుల్లో ఈ మొక్కలు నాటితే కనువిందుగా ఉంటాయి. ఇవి తేమ నేలలో బాగా పెరుగుతాయి. వీటి పువ్వుల్లో తేనె ఉండటంతో సీతాకోకచిలుకలు, తేనెటీగలు వీటి చుట్టూతా పరిభ్రమిస్తూ ఉంటాయి.


                                                                     నిఫోఫియా లీనిరిఫోలియా బేకర్‌ ..

 నిఫోఫియా లీనిరిఫోలియా బేకర్‌ ..

ఇదో వింతైన పూలమొక్క. ఆకులు సన్నగా, చిన్నగా ఉంటాయి. నాలుగైదు అడుగుల ఎత్తు వరకూ మొక్క పెరుగుతుంది. దానికి గొట్టాల్లాంటి పువ్వులు విచ్చుకుంటాయి. పై భాగంలోని పువ్వులు కాషాయంలోనూ, కింది భాగంలోని పువ్వులు పసుపు రంగులోనూ ఉంటాయి. మొత్తానికి అంతా కలిపి ఒకే పువ్వులా, పుష్పగుచ్ఛంలా భలే తమాషాగా ఉంటుంది.


- చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506