నోటిపూతను ఇట్టే తగ్గించే ఉసిరి బిలింబి, పిల్లలు లొట్టలేసుకుంటూ తినే నక్షత్ర ఫలాలు, పోషకాలు మెండుగా ఉండే ఎల్లో బొప్పాయి గురించి ఈ వారం తెలుసుకుందాం. అంతేనా ఆ ఒక్క పండు తింటే చాలు, నోరంతా తీయగా అయిపోతుంది. ఆ పండేదో తెలుసా? ఇంకా రంగురంగుల కలబోతలతో పక్షుల ముక్కుల్లాంటి వేలాడే గొలుసుకట్టు పువ్వులేమిటో తెలుసా ?
సరికొత్త ఉసిరి బిలింబి
అంగుళం లావు, రెండూ, రెండున్నర అంగుళాల పొడవు ఉండే సరికొత్త ఉసిరి కాయ బిలింబి. చెట్టు కాండానికి, కొమ్మలకు అంటిపెట్టుకుని గుత్తులు గుత్తులుగా కాస్తాయి. చాలా పుల్లగా ఉంటాయి. వీటిని పచ్చడి చేసుకోవచ్చు. ఇంకా పప్పు, ఇతర కూరల్లోనూ పులుపుకోసం వాడుకోవచ్చు. విటమిన్ 'సి' పుష్కలంగా ఉంటుంది. ఇవి తింటే నోటిపూత త్వరగా తగ్గుతుంది. వీటిని పక్వానికొచ్చిన తరువాత వెంటనే కోయకపోతే కాయలు రాలిపోయి నీరుగారిపోతాయి. మొక్క నాటిన మూడేళ్ళకి బిలింబిలు కాపునిస్తాయి. ఐదు నుంచి 10 అడుగుల వరకూ చెట్టు పెరుగుతుంది. కత్తిరించుకుంటూ ఎత్తును మనం సర్దుబాటు చేసుకోవచ్చు. ఇవి ఏడాది పొడుగునా కాయలు కాస్తాయి. కానీ వర్షాకాలంలో కాపు మరింత ఎక్కువగా ఉంటుంది. వీటిని ఇంటి ముంగిటా, పెరట్లోనూ పెంచుకోవచ్చు. ఉసిరి బిలింబిని దోస బిలింబి, దోసచెట్టు, సోరెల్ వృక్షం అనీ పిలుస్తారు.
నక్షత్రాలు కాసే చెట్టు
నక్షత్ర ఫలాలు మూడంగుళాల పొడవు ఉంటాయి. కాయ చుట్టూ పొడవుగా ఐదు అంచులు ఉండేలా అపురూపంగా అనిపి స్తాయి. వీటిని అడ్డంగా ముక్కలుగా కోస్తే అచ్చు నక్షత్రాల్లానే ఉంటాయి. కాబట్టి వీటిని స్టార్‌ఫ్రూట్ అనీ పిలుస్తారు. ఇంకా అంబాణపు కాయ, కర్మరంగము, తమాటకాయ, కరంబోలా అనీ అంటారు. వీటి శాస్త్రీయ నామం Averrhoa carambola కడియం పరిసర ప్రాంతాల్లో రైతులు మాత్రం కమరక్కాయలు అంటుంటారు. పచ్చి కాయలు చేదుగాను, పక్వానికొచ్చిన కాయలు పుల్లగాను, పండినవి తియ్యగాను ఉంటాయి. ఆకుపచ్చగా ఉండే ఈ కాయలు మగ్గితే లేత నారింజ రంగులోకి మారతాయి. ఎ, సి విటమిన్లు, మినరల్స్, పీచు పదార్థం ఈ ఫలాల్లో పుష్కలంగా ఉంటాయి. హోటల్స్‌లో ఫ్రూట్ సలాడ్లొ స్టాఫ్రూట్ ముక్కలను వాడుతూ ఉంటారు. ఈ మొక్క నాటిన మూడేళ్ళ తరువాత కాపుకొస్తుంది. 25 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. వీటి ఆకులు రాత్రులు వాడిపోయి నిస్సత్తువతో ఉంటాయి. ఈ పళ్ళను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకేసారి ఎక్కువ మోతాదులో తింటే ఎసిడిటీ వస్తుంది.
ఎంతో చక్కని ఎల్లో బొప్పాయి
పోషకాలు మెండుగా ఉండే నిండైన పండు బొప్పాయి. వీటిలో ఎన్నో రకాలున్నాయి. వాటన్నింటిలో ఎల్లో బొప్పాయి ప్రత్యేకమైంది. ఈ పండు సమానమైన తీపిలో ఉంటుంది. కాయ ఆకారం సన్నగా పొడవుగా ఉంటుంది. ఎల్లో బొప్పాయి కాయ పైన తొక్క, లోపలి గుజ్జూ పసుపురంగులో ఉండటం విశేషం.చెట్టు ఆపాదమస్తకంగా కాయలు కాస్తాయి. కాయ లోపల గింజలు పెద్దగా ఉండవు. ఎర్ర నేలలో నాటిన చెట్టు కాయలు మరింత రుచిగా ఉంటాయి. మొక్క నాటిన ఎనిమిది నెలలకు కాపుకు వస్తాయి. ఈ మొక్కలకు త్వరగా తెగుళ్లు వస్తాయి. అందుకే వీటిని తోటలుగా సాగు చేయరు. కానీ ఇది ఇంటి ముంగిట పెరట్లో పెంచుకుంటే ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
సీతమ్మవారి వాలుజాడ..
సిగ నుంచి జాలువారే పొడవాటి కురుల్ని పాయలు పాయలుగా జడలల్లినట్టు పూలుండే మొక్క సీతమ్మ వారి వాలుజడ మొక్క. దీని శాస్త్రీయనామం ఫీలోడియం పుల్చెల్లమ్. ఇది మూడు, నాలుగడుగులు ఎత్తు వరకూ పెరుగుతుంది. వీటి పూలు చూడటానికి జడ మాదిరిగానే ఉంటాయి. సన్నని కాండానికి పూరేఖలు పాయలుగా అల్లినట్లు గమ్మత్తుగా ఉంటాయి. ఇవి ప్రతిరోజూ పూలు పూస్తాయి. శీతాకాలంలో అయితే వీటి పూల గుభాళింపు ఘనంగా ఉంటుంది. వీటిని కుండీల్లో చక్కగా పెంచుకోవచ్చు. ఆకులు, పువ్వులు ఆకుపచ్చగా ఒకే రంగులో ఉండటం వల్ల దీని ప్రత్యేకత అంతగా కనిపించదు. ఒకవేళ పువ్వులు వేరే రంగులో ఉండుంటే భలే విభిన్నంగా ఉండేవి. పూణే పరిశోధనా కేంద్రంలో ఈ దిశగా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి.
- చిలుకూరి శ్రీనివాసరావు,
89859 45506