ప్రజాశక్తి - ఆరిలోవ : విమ్స్ ఆసుపత్రిని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి.లకీëనారాయణ సోమవారం సందర్శించారు. విమ్స్ ఆర్‌ఎంఒ డాక్టర్ హరికృష్ణతో కలిసి రోగుల ఒపి, అత్యవసర విభాగం, ఐసియు, ఇన్‌పేషెంట్ వార్డులతో పాటు విమ్స్ పరిసరాలను పరిశీలించారు. వార్డుల్లో రోగులతో మాట్లాడారు. వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ, విమ్స్ ఆసుపత్రి హైదరాబాద్ నిమ్స్ తరహాలో ఉందన్నారు. విశాఖ వాసులతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలకు విమ్స్ ఆసుపత్రి ఒక మంచి ఆరోగ్య కేంద్రంగా ఉంటుందని చెప్పారు. పూర్తి స్థాయిలో వైద్యుల కొరతను తీరిస్తే కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా ఉంటుందన్నారు. ఇక్కడకు మెడికల్, నర్సింగ్ కళాశాలలు వస్తే మంచి ఆరోగ్య కేంద్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు. 2,500 మంది సామర్ధ్యం ఉన్న విమ్స్‌కు ప్రస్తుతం 400 మంది మాత్రమే ఒపికి వస్తున్నట్లు తెలిపారు. జెడి ఫౌండేషన్ తరపున తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఈ సందర్శనలో జెడి ఫౌండేషన్ కన్వీనర్ ప్రియాంకారావు దండి, కో-ఆర్డినేటర్ జగన్ మురారీ పాల్గొన్నారు.










