ప్రజాశక్తి - ఆరిలోవ : నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా విమ్స్ ఆసుపత్రికి రూ.250 కోట్లు కేటాయించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎమ్‌టి.కృష్ణబాబు వెల్లడించారు. వీటిలో మొదటి విడతగా రూ.72 కోట్లు మంజూరు చేసినట్టు ఆయన తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన విమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ముందుగా ఆయన ఆసుపత్రి పరిసరాలను, రోగులు ఉండే వార్డులను పరిశీలించారు. అక్కడ అందుతున్న వైద్య సేవలు గురించి స్వయంగా రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడం, రోగులు, బంధువులు వేచి ఉండే కుర్చీలు తుప్పు పట్టి ఉండడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో రూ.72 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. వీటిలో రూ.60 కోట్లను ఆసుపత్రిలో రెండు బ్లాకుల నిర్మాణానికి, మిగతా రూ.12 కోట్లు ఆసుపత్రిలో పనిముట్లు సమకూర్చడానికి ఖర్చు చేయనున్నట్టు తెలిపారు.
మొదటి విడత పనులను వచ్చే మార్చి నెలలోపు పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న 450 పడకలకు సరిపడా పూర్తి స్థాయిలో వైద్యులను, పారా మెడికల్ సిబ్బందిని నియమించేందుకు అన్ని చర్యలూ తీసుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.










