- ఒకటి మినహా అన్ని అల్ పాస్
- జీరో అవర్‌లో వెల్లువెత్తిన సమస్యలు
- ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం
ప్రజశక్తి - చీరాల
మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సమస్యలు వెల్లువెత్తాయి. అజెండాకు ముందుగా జీవో అవర్ నిర్వహించారు. పలువురు కౌన్సిలర్లు తమ వార్డులోని సమస్యలను సభదృష్టికి తెచ్చారు. పరిష్కారం చేయాలని అధికారులను నిలదీశారు. 31వార్డులో ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ సత్యానందం సభ దృష్టికి తీసుకొచ్చారు. వాస్తవానికి ఆ ప్రాంతంలో అభివృద్ది పనులు జరుగుతున్నాయని కమిషనర్ రామచంద్రారెడ్డి వివరణ ఇచ్చారు. ఆక్రమణలు ఏమైనా జరిగితే వెంటనే గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా పురపాలకసంఘం ద్వారా అందుతున్న శుద్దిజలం కలుషితంగా మారిందని కౌన్సిలర్లు పేర్కొన్నారు. పట్టణ శివారు ప్రాంతమైన దండుబాటులో వర్షాకాలం నీళ్లు నిలిచి దోమలు విజృంభిస్తున్నాయని అన్నారు. ప్రజలు విషజ్వరాలతో హాస్పిటల్ పాలవుతున్నారని అన్నారు. వర్షపు నీళ్లు నిలవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ పాపిశెట్టి సురేష్ కోరారు. ఊటుకూరి వారి వీధిలో రహదారి నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రహాదారిని త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. వీరితోపాటు మరికొంతమంది కౌన్సిలర్లు వివిధ సమస్యలను సభ ముందు ఉంచారు. సమావేశంలో డీఈ ఏసయ్య, టీపీఎస్ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.










