Oct 26,2023 21:11

ప్రభుత్వం రిజర్వు చేసిన భూముల్లో నుంచి వేసిన రహదారి

ప్రజాశక్తి భోగాపురం :  ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటనలకు వచ్చే ప్రభుత్వ పెద్దలైనా..అధికారులైన భోగాపురం మండలంలోని అత్యంత ఖరీదైన ప్రముఖ రిసార్ట్‌లోనే సేద తీరుతుంటారు. అది పగలైనా రాత్రైనా. అందుకేనేమో.. ఇంకెవడ్రా మనల్ని అపేది అనుకుందేమో ఆ రిసార్ట్‌ సంస్థ. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం పరిహారం అందజేసి విమానాశ్రయం కోసం సేకరించిన భూముల నుంచి ఎటువంటి అనుమతులూ లేకుండానే ఏకంగా ఆ రిసార్ట్‌ సంస్ఠ తాము కొత్తగా వేస్తున్న వ్యాలీ అనే రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌కు అడ్డుగోలుగా గ్రావెల్‌ రోడ్డును దిబ్బలపాలెం సమీపంలో నిర్మించుకుంది. అదికూడా త్వరలో నిర్మించబోయే బీచ్‌ కారిడార్‌ రోడ్డునుంచి నేరుగా తమ వెంచర్‌ వరకు వేసేశారు. మరి ఇంత అడ్డగోలుగా ఆ సంస్థ తమ సొంత యంత్రాలతో గత కొన్ని రోజులు నుంచి నిర్మిస్తుంటే అధికారులు మాత్రం కళ్లకు గంతలు కట్టుకోవడం విశేషం. భోగాపురం మండలంలో ఆ రిసార్ట్‌ సంస్థ చేస్తున్న అడ్డగోలు వ్యవహారం ఇది. వివరాల్లోకి వెళితే...
భోగాపురం మండలంలో విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 2700 ఎకరాలు భూములను సేకరించింది. సేకరించిన భూముల్లో సుమారు 500 ఎకరాలు ప్రభుత్వం ఐటి కంపెనీలకు, ఇతర అవసరాలకు రిజర్వులో ఉంచింది. ఈ భూమికి పడమర వైపు ఈ రిసార్ట్‌ సంస్థ కొత్తగా వ్యాలీ పేరుతో వెంచర్‌ వేస్తోంది. ఈ వెంచర్‌కు సుమారు 3కిలో మీటర్లు దూరంలో కొత్తగా నిర్మించబోయే బీచ్‌ కారిడార్‌ రోడ్డు ఉంది. ఈనేపథ్యంలో దిబ్బలపాలెం వెళ్లే రహదారికి నేరుగా ప్రభుత్వం అట్టిపెట్టుకున్న 500 ఎకరాల్లో నుంచి గత కొన్ని రోజులుగా సుమారు 40అడుగుల విస్తీర్ణంతో రహదారిని నిర్మించేశారు. ఈ రహదారి బీచ్‌కు ఆనుకొని మరో పెద్ద వెంచర్‌ ఈ సంస్థకు ఉంది. అయితే ఈ రెండింటికి అనుసంధానం చేసేలా అడ్డగోలుగా ఈ భూముల్లో నుంచి రహదారిని నిర్మించేశారు.
ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణం
ప్రభుత్వం అట్టి పెట్టుకున్న భూముల్లో నుంచి తమ వెంచర్‌కు రహదారిని నిర్మించేందుకు వీరికి ఎటువంటి అనుమతులు లేవు. కాని ఏకంగా తమ సొంత వాహనాలతో రహదారిని నిర్మించడం గమనార్హం. పోనీ విమానాశ్రయం పనులు జరుగుతున్నాయి అందుకోసం ఈ రహదారిని నిర్మించుకున్నారంటే ఈ భూములకు విమనాశ్రయం నిర్మాణానికి ఎటువంటి సంబంధమూ లేదు. అంతేకాక ఇంకా నిర్మించబోయే విమానాశ్రయం ప్రహరీ గోడ పక్క నుంచి ఈ రహదారిని నిర్మించారు. అంటే కేవలం తమ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లోని ప్లాట్లును అమ్ముకోవడానికి, ఈ రహదారి నేరుగా బీచ్‌కు వెళ్తుందని చూపించడానికి ఈ రహదారిని నిర్మించారన్న విమర్శలు వస్తున్నాయి. ఇంతలా జరుగుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం.
రహదారిని పరిశీలించి చర్యలు తీసుకుంటాం
ప్రభుత్వం అట్టిపెట్టుకున్న భూముల్లో నుంచి రహదారిని వేస్తున్న వ్యవహారం మా దృష్టికి రాలేదు. ఆ రహదారికి అనుమతులు ఉన్నవీ లేనివీ పరిశీలిస్తాం. అవసమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి రహదారిని నిర్మాణాన్ని నిలిపివేస్తాం.
చింతాడ బంగార్రాజు, తహశీల్దారు, భోగాపురం