
ప్రజాశక్తి-భోగాపురం : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులకు సంబంధించిన భూమి పూజ నవంబర్ ఒకటో తేదిన ఎల్‌అండ్‌టి సంస్థ చేయనుంది. విమానాశ్రయ పనులను ఇప్పటికే ప్రభుత్వం జిఎంఆర్ సంస్థకు అప్పజెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే జిఎంఆర్ సంస్థ ప్రహరీగోడ నిర్మాణ పనులను వేరే సంస్థకు ఇవ్వగా, తాజాగా విమానాశ్రయ నిర్మాణ పనులను మరో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టికి సబ్ కాంట్రాక్టు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎల్ అండ్ టి సంస్థ ప్రతినిధులు సుమారు 20 రోజుల కిందట ఇక్కడ చేరుకున్నారు. తమ సిబ్బందికి కావాల్సిన కార్యాలయాలు, నివాసాల కోసం విమానాశ్రయ భూములు చుట్టూ ఉన్న దల్లిపేట, గూడెపువలస, కంచేరు, భోగాపురం తదితర గ్రామాల్లో తిరుగుతున్నారు. అవసరమైన గృహాలు, కార్యాలయాలను అద్దెకు కూడా తీసుకున్నారు. కూలీల కోసం తాత్కాలిక షెడ్లను వేసేందుకు కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎయిర్‌పోర్టుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం విమానాశ్రయ భూముల చుట్టూ ప్రహరీగోడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
కవులవాడ సమీపంలో భూమిపూజ
విమానాశ్రయ నిర్మాణ పనులకు సంబంధించిన భూమి పూజను నవంబర్ ఒకటో తేదిన చేయాలని ఎల్‌అండ్‌టి సంస్థ నిర్ణయించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. కవులవాడ సమీపంలో సేకరించిన భూముల వద్ద ఈ భూమి పూజ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ భూమిపూజకు ఎల్‌అండ్‌టి సంస్థతోపాటు జిఎంఆర్ సంస్థ ఉన్నత స్థాయి అధికారుల హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ భూమి పూజ తర్వాత భూమిని చదును చేసే పనులు ప్రారంభం అవుతాయి.