Nov 09,2022 23:32

  • సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి వై.నరసింహారావు

ప్రజాశక్తి - గన్నవరం : విమానాశ్రయ విస్తరణ నిర్వాసితుల పోరాటానికి తమ పార్టీ అండగా ఉంటుందని సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి వై.నరసింహారావు చెప్పారు. ఉధృత ఆందోళనల ద్వారానే బాధితులకు న్యాయం జరిగే పరిస్థితి నెలకొందన్నారు. విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ కృష్ణాజిల్లా గన్నవరం మండలం దావాజీగూడెంలో నిర్వాసితులు చేపట్టిన నిరసన దీక్షా శిబిరాన్ని బుధవారం సిపిఎం నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు, భూములు కోల్పోయిన వారిని పూర్తిస్థాయిలో ఆదుకుంటామని అప్పటి టిడిపి ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం బాధిత నిర్వాసితులకు, రైతులకు న్యాయం చేయడానికి ముందుకు రావడంలేదని విమర్శించారు. ఇళ్లు కోల్పోయి అద్దె ఇళ్లలో ఉంటున్న వారికి ఒక్కొక్కరికి రూ.3 లక్షల వరకు బకాయిలు పెట్టిందని గుర్తుచేశారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలో పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పిన మాట నీటి మూటలవుతున్నాయని విమర్శించారు. కనీసం ఇల్లు కట్టుకోడానికి ఒక్కో కుటుంబానికి ఇస్తామని చెప్పిన రూ.9 లక్షలు కూడా ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడ్డారు. నిర్వాసితులంతా సంఘటిత పోరాటం ద్వారానే సమస్యను పరిష్కరించుకోగలరన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు. ఈకార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు కళ్లం వెంకటేశ్వరరావు, టివి.లక్ష్మణస్వామి, మండల నాయకులు అనుమోలు వెంకటేశ్వరరావు, మరియదాసు, మల్లంపల్లి జయమ్మ, బుద్ధవరం సర్పంచ్‌ బడుగు బాలమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని నిర్వాసితుల పోరాట కమిటీ స్పష్టం చేసింది. ఈఉద్యమానికి తిరువీధి ఏసురత్నం నేతృత్వం వహించారు.