Nov 08,2022 23:14

  • విషం తాగుతామని బాటిల్‌ పట్టుకుని మహిళల హెచ్చరిక
  • ప్రభుత్వ తీరుపై మండిపాటు

ప్రజాశక్తి - గన్నవరం : ''ఇళ్లు కూల్చి మూడేళ్లవుతోంది. కొత్తగా ఇల్లు కట్టించి ఇవ్వలేదు. స్థలాలు చూపలేదు. రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని చెప్పి పట్టాలు కూడా ఇవ్వలేదు. మురుగు కాల్వ పక్కన ఉంటూ దోమలతో అష్టకష్టాలూ పడుతున్నాం. అద్దె డబ్బులివ్వడం లేదు. ఇల్లు కట్టుకునేందుకు ఇస్తామన్న డబ్బులివ్వడం లేదు. ఆర్‌ అండ్‌ ఆర్‌ స్థలాల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ప్రభుత్వం మమ్ములను దగా చేస్తోంది'' అంటూ మంగళవారం దావాజీగూడెం రోడ్డుపై విమానాశ్రయ నిర్వాసితులు రాస్తారోకో చేశారు. మహిళలు విషం డబ్బా తీసుకొని ప్రభుత్వం స్పందించకపోతే తాగి చచ్చిపోతామని హెచ్చరించారు. రహదారిపై గంటల తరబడి రాస్తారోకో చేయడంతో పెద్దఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వెంటనే గన్నవరం పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసుల రంగప్రవేశంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఈసందర్భంగా పోరాట కమిటీ నాయకులు తిరువీధి యేసు రత్నం, తంబి మాట్లాడుతూ మూడేళ్ల నుండి ప్రభుత్వం తమను అధికారుల చుట్టూ తిప్పుకుంటుందేతప్ప తమ సమస్యలు పరిష్కరించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణానికి రూ.9 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. అద్దె ఇళ్లలో ఉంటున్న వారికి అద్దెలు కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున అద్దె డబ్బులు రావాల్సి ఉందన్నారు. తమ బాధను ఎవరూ పట్టించుకోవడంలేదని కన్నీరు పెట్టారు. మురుగునీరు తాగాల్సిన దుస్థితి నెలకొందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వేడుకున్నారు. తమ సమస్యను చెప్పుకునేందుకు సీఎం వద్దకు తీసుకెళ్లాలని లేకపోతే సీఎంను ఇక్కడికి రప్పించాలని బాధిత మహిళలు డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనలో బుద్దవరం సర్పంచ్‌ బడుగు బాలమ్మ పాల్గొని సంఘీభావం తెలిపారు. విమానాశ్రయ నిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరారు. సిఐటియు మండల నాయకులు బడుగు మరియదాసు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరువీధి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పోలీస్‌ అధికారులు నిరసనకారులతో చర్చించి ఆందోళన విరమింపజేశారు.