ప్రజాశక్తి -కరాస: విధి నిర్వహణలో భాగంగా ఎఎన్-32 విమాన ప్రమాద దుర్ఘటనలో అమరులైన ఎనిమిది మంది ఎన్‌ఎడి ఉద్యోగులకు ఘన నివాళులర్పించారు. శుక్రవారం నేవల్ ఆర్నమెంట్ డిపో (ఎన్‌ఎడి) మెయిన్ గేటు వద్ద ఎన్‌ఎడి సిఇ యూనియన్ నేతత్వంలో అమరులైన ఎనిమిది మంది కార్మికుల ఆరవ వర్ధంతి సందర్భంగా సహచర ఉద్యోగులు, యూనియన్ నాయకులు, కార్మికులు సంతాప సభ నిర్వహించారు. పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పాల్గొని అమరుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అమరులైన కార్మికుల జ్ఞాపకార్థం ఎన్‌ఎడి సిఇ యూనియన్ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఎఎస్.రాజా బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో కొత్త రోడ్డు హాష్మి భవనంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ, సహచర ఉద్యోగుల జ్ఞాపకారం ఎన్‌ఎడి కార్మికులు రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. సామాజిక సేవా కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్న కార్మికులకు యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ అభినందనలు తెలిపారు.










