ఏమి త్యాగం చేశావని ...
ఈ దేశం మీద ''ద్వేషం'' నీకు ?
ఏమి ఉద్ధరించావని ...
ఈ వ్యవస్థపై ''అక్కసు'' నీకు ?
ఎంతసేపు ...
నీ స్వీయ శ్రేయస్సు కోసం
తండ్లాడటల తలమునకలై తప్పా
నీ జాతికోసం ఏనాడైనా తపించావా?
ఊహల పల్లకిలో ఉరేగుట తప్పా
ఋజువర్తనతో ఎప్పుడైనా ప్రవర్తించావా?
అందని వాటికి అర్రులు చాచడం తప్పా
ఉన్నదాంట్లో సంతృప్తిని వెతుక్కున్నావా ?
నిత్యం అంతరాల ఆరాటమే తప్పా
సమైక్య జీవన దృశ్యం స్వప్నించావా?
ఏమి ఆశించకుండానే
ఈ గాలి, నీరు, చెట్టు, ప్రకృతి
నీ శ్వాశనముల్ ఊపిరి
ఈ పుడమితల్లి కడదాక భరిస్తూ
చచ్చాక ఐక్యం చేసుకుంటుంది
నోరులేని జీవ ధాతువులే
త్యాగాలకు నిలయమైనపుడు
బుద్ధి జీవివైన నువ్వెందుకు
సంకుచితాల నెలవవుతావు ?
ఇప్పటికైనా ...
నీ పుట్టుకకు సార్థకత చేకూర్చ
ఈ పుణ్యభూమి రుణం కాస్త తీర్చ
సత్సంకల్పంతో అడుగు ముందుకేరు
విశ్వప్రాణుల శ్రేయస్సు కాంక్షిస్తూ
విశాలత్వ బీజం అంకురింపజేరు
మానవతా విలువలు పండించేరు
అప్పుడే మానవజాతి
శాంతి సౌభాగ్యమై వర్ధిల్లేది
ఈ విశాల జగతి
సస్యశ్యామలమై విలసిల్లేది
- కోడిగూటి తిరుపతి
9573929493