
ప్రజాశక్తి - చిలమత్తూరు : ప్రభుత్వ భూమి అంటే పేదలకు సంబందించిన భూమి కదా? విలువైన భూమి అయితే పేదలు ఇళ్ల నిర్మాణాలు చేసుకోవడానికి అర్హులు కాదా..? అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి ప్రశ్నించారు. చిలమత్తూరు మండలంలో జరుగుతున్న భూస్వాధీన పోరాటంలో భాగంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో వారితో పాటు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జి ఎల్ నరసింహులు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు బాబ్జాన్, వ్యకాసం జిల్లా కార్యదర్శి పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక రెవెన్యూ అధికారులు అవగాహన లోపంతో చేసిన తప్పుకు పేదలు గత నాలుగేల్లుగా ఇళ్లు లేక బిక్కుబిక్కు మంటు గుడిసెలలో జీవించాల్సిన దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున రెవెన్యూ అధికారులు చూపిన భూమి కోర్టు కేసులో ఉందని అక్కడ నిర్మాణం కుదరదని అంటున్నారని అన్నారు. దీంతో పేదలు ప్రభుత్వ స్థలంలో ఇళ్ల నిర్మాణాలకోసం గుడిసెలు వేసుకుంటే విలువైన స్థలం కాబట్టి ఇవ్వలేమని అంటున్నారని, మరోచోట లేఅవుట్ వేసి పట్టాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు చేసివ్వమంటే ఆ పని చేయలేకున్నారని విమర్శించారు. ఇక పేదలు ఎక్కడ నివాసం ఉండాలో చెప్పాలని ప్రశ్నించారు. భూస్వాధీన పోరాటంలో పాల్గొంటున్న నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసేందుకు కుట్ర చేస్తున్నారని అదే జరిగితే దీనిన జిల్లావ్యాప్త ఉద్యమంగా మారుస్తామని హెచ్చరించారు. పేదలు న్యాయ బద్దంగా శాంతి యుతంగా ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని జీవనం చేసుకుంటున్నారని వాటిని తొలిగించాలంటే ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఇళ్ల పట్టాలు ఇచ్చి గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరలోనే ఈ భూమిలో నీటి సౌకర్యం కోసం చందాలు వేసుకొని బోరు వేసుకుంటామని స్పష్టం చేశారు. అరెస్టు చేయడం,భయబ్రాంతులకు గురుచేయడం మాని కనీస వసతులు కల్పించేందుకు అదికారులు కృషి చేయాలని సూచించారు. ఒక వేళ బలవంతంగా గుడిసెలు తొలిగిస్తే పేదలకు ఇళ్లు ఇచ్చేవరుకు ప్రభుత్వ కార్యాలయాలు ముందే తిష్ట వేస్తామని హెచ్చరించారు. కార్యాయాలను పేదల నివాసాలుగా మారుస్తారో లేక శాంతి యుతంగా గుడిసెలు వేసుకున్న చోట జీవనం చేసుకోమంటారో అధికారులు తేల్చుకోవాలని చెప్పారు. ఈ భూమిని పేదలు చేతికి ఇవ్వకుండా బడాబాబులు చేతికి అందించేందుకు ప్రభుత్వాలు పని చేస్తుంటాయనిదానిని కట్టడి చేస్తూ ఇది పేదలు భూమి అని గుర్తు చేసే పనిని కమ్యునిస్టు పార్టీలు చేస్తుంటాయని అన్నారు. పేదలకు సెంటు భూమిని ఇవ్వాలంటే కడుపు మండే ప్రభుత్వాలకు పెట్టుబడిదారులుకు మాత్రం వేల ఎకరాలు ధారదత్తం చేయడానికి చివాతీలు వేస్తుంటాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వ్యకాసం జిల్లా కమిటి సభ్యులు గంగాధర్, సదాశివరెడ్డి, చందు, శివ, చరణ్, మణిస్వామి, రహంతుల్లా తదితరులు పాల్గొన్నారు.