Aug 30,2022 23:48

మాట్లాడుతున్న మంత్రి బూడి ముత్యాలనాయుడు, వేదికపై సుభద్ర

ప్రజాశక్తి - అనకాపల్లి ప్రతినిధి
'నాడు-నేడు' కింద పాఠశాల భవనాలు చక్కగా నిర్మించి, తరువాత ఇతర పాఠశాలల్లో కలపడంతో ప్రజల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోందని జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు అన్నారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన సర్వ సభ్య సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశా లలను ఇతర పాఠశాలల్లో విలీనం చేయడం, పిల్లలకు తగినట్లు ఉపాధ్యాయులు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఇతర పాఠశాలలకు వెళ్లి పోతున్నారని తెలిపారు. ఏజెన్సీలోని ఉన్నత పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో సీట్లు పెంచకపోతే విద్యార్థులు చదువులకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. కోటవురట్ల ఉన్నత పాఠశాలలో 650 మంది విద్యార్థులకు ఆరుగురు ఉపాధ్యాయులున్నారని, కైలాసపట్నం ప్రాథమిక పాఠశాలలో 30 మందికి 17 మంది విద్యార్థులే వున్నారని జెడ్‌పిటిసి ఉమాదేవి అన్నారు. నర్సీపట్నం మండలంలో ఐదు పాఠశాలలను ప్రభుత్వం విలీనం చేసిందని, వేములపూడి ఉన్నత పాఠశాలలో 900 మంది పిల్లలకు సరిపడా తరగతి గదుల్లేక పడుతున్న ఇబ్బందులను సమా వేశంలో ప్రస్తావించిన ఆమె అదనపు తరగతి గదులు మంజూరుచేయాలన్నారు. అనంతగిరి సిపిఎం జెడ్‌పిటిసి డి.గంగరాజు మాట్లాడుతూ మండలంలోని మారుమూల గ్రామాల్లో ప్రాథమిక విద్య సరిగాలేక పిల్లలు పెద్ద క్లాసుల్లో వెనుకబడుతున్నారని తెలిపారు. ఏజెన్సీలో ఏకలవ్య పాఠశాలల్లో విద్యాబోధన జరిగేలా ఉపాధ్యాయులను పూర్తి స్థాయిలో నియమించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టైఫాయిడ్‌, మలేరియా పరీక్షలు నిర్వహించకపోవడంతో ఎస్‌.కోట వెళ్లాల్సి వస్తోందన్నారు. ఏజెన్సీలోని పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో సీట్ల సంఖ్యను పెంచాలని కొయ్యూరు జెడ్‌పిటిసి నూకరాజు సహా పలువురు జెడ్‌పిటిసిలు డిమాండ్‌ చేశారు.
ఏజెన్సీకి బదిలీ అయిన ఉద్యోగులను మైదాన ప్రాంతంలో వుంచకుండా పంపించాలని అరకు ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ అన్నారు. కొయ్యూరు మండలం, బంగారమ్మపేటలో విధులకు హాజరుకాని ఉపాధ్యాయునికి నోటీసులు జారీచేయాలని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సూచించారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించకుండా అనకాపల్లి వెళ్లాలని వైద్యులు చెబుతున్నట్లు వైద్యాధికారుల దృష్టికి జెడ్‌పిటిసి రమణమ్మ తీసుకొచ్చారు. మునగపాక పిహెచ్‌సిలో పాముకాటు మందులేక అనకాపల్లి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సివచ్చిందని, గ్రామీణ ప్రాంతంలోని ప్రతి పిహెచ్‌సిలోనూ పాము కాటు మందులు సిద్ధంగా వుంచాలని గవర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బొడ్డేడ ప్రసాద్‌ అన్నారు.
కెజిహెచ్‌లో పోస్టుమార్టం చేసేందుకు బాధిత కుటుంబాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పరవాడ, మునగపాక జెడ్‌పిటిసిలు పైలా సన్యాసిరాజు, స్వామి సత్యనారాయణ సమావేశం దృష్టికి తీసుకురావడంపై విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున తీవ్రంగా స్పందించారు. పోస్టు మార్టం చేసేందుకు సిబ్బంది డబ్బులు వసూళ్లపై ఎఎంసి ప్రిన్సిపాల్‌తో విచారణ చేపడతామని అన్నారు. జెడ్‌పిటిసిలకు గౌరవ వేతనం చెల్లించాలని నర్సీపట్నం, రోలుగుంట జెడ్‌పిటిసిలు రమణమ్మ, లక్ష్మీ రమణమ్మ అన్నారు. జెడ్‌పిటిసిలకు అధికారులు స్పందించేలా ఆదేశాలివ్వాలని బుచ్చెయ్యపేట జెడ్‌పిటిసి దొండా రాంబాబు కోరారు. మూడు నెలల గౌరవ వేతనం బ్యాంకు ఖాతాల్లో త్వరలో జమవుతాయని ఛైర్‌పర్సన్‌ సుభద్ర తెలిపారు.
వ్యవస్థలు మెరుగుపడ్డాయి : మంత్రి ముత్యాలనాయుడు
విద్య వైద్య వ్యవస్థలు గతం కంటే మెరుగుపడ్డాయని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. గత ప్రభుత్వం విస్మరించిన సమస్యలను ఒక్కొక్కటిగా తమ ప్రభుత్వం పరిష్కరించుకుంటూ వస్తోందన్నారు. సమిష్టిగా బాధ్యతలు నిర్వహిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నారు. జలజీవన్‌ మిషన్‌ కింద ఇంటింటికి కొళాయి ఏర్పాటుపై వేగవంతంగా ప్రభుత్వం పనులు జరిగేలా చూస్తోందన్నారు. సమావేశ ప్రారంభంలో అధికారుల హాజరు తక్కువగా వుండడంతో సమావేశానికి హాజరుకాని అధికారులను గుర్తించాలని జిల్లా పరిషత్‌ సిఇఒ సత్యనారాయణను ఆదేశించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, యువి.రమణమూర్తిరాజు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌, పివిఎన్‌.మాధవ్‌, అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ రవి పట్టాన్‌శెట్టి, అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జె.శివ శ్రీనివాస్‌, ప్రభుత్వ శాఖాధిపతులు పాల్గొన్నారు.