ప్రజాశక్తి - ఏలూరు టౌన్
ఏలూరు కార్పొరేషన్‌లో విలీనమైన ఏడు పంచాయతీల కార్మికులకు మూడు నెలల జీతాలు, ఒహెచ్‌ఎస్‌తో కలిపి తక్షణం చెల్లించాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) రాష్ట్ర ఉపాధ్యక్షులు భజంత్రీ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శనివారం నగర కార్పొరేషన్ కమిషనర్ షేక్ షాహిద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భజంత్రీ శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికులకు నాలుగు నెలల హెల్త్ అలవెన్స్ ఇవ్వాలన్నారు. మూడేళ్లుగా బకాయి ఉన్న యూనిఫారాలు, సబ్బులు, చెప్పులు, కొబ్బరి నూనె, కుట్టు కూలి మంజూరు చేయాలని కోరారు. కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులకు పనిముట్లు, తోపుడు బండ్ల ప్రిన్స్ డబ్బాలు సరిగా పనిచేయట్లేదని వాటి స్థానంలో కొత్త పనిముట్లు సమకూర్చాలని కోరారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎపి మున్సిపల్ వర్కర్స్ ఏలూరు యూనియన్ నగర అధ్యక్షులు కసింకోట నాగేంద్ర, ఉపాధ్యక్షులు ఇంటి అశోక్, బంగారు దుర్గాప్రసాద్, కార్యవర్గ సభ్యులు దొడ్డిగర్ల నాగబాబు, బంగారు కృష్ణ, పంతం శోభన్‌బాబు, అల్లం పెద్దిరాజు, ప్రవీణ్, నాగబాబు, మహేష్, చంద్రమౌళి పాల్గొన్నారు.










