Nov 29,2022 22:02

ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌
          నగరపాలక సంస్థ పరిధిలోని ఏడు విలీన గ్రామపంచాయతీ ప్రజలకు గోదావరి జలాలు అందించే దిశగా ప్రణాళికలు రూపొందించి తగు చర్యలు చేపట్టామని నగర కమిషనర్‌ షేక్‌ షాహిద్‌ తెలిపారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో మంగళవారం కమిషనర్‌ తన ఛాంబర్‌లో తాగునీటి సరఫరాపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆదేశాల ప్రకారం నగర ప్రజలకు నీటి సరఫరా రెండు పూటలా అందించేందుకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామన్నారు. 150 కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. దెందులూరు బైపాస్‌ వద్ద గల ప్రధాన మంచినీటి నిల్వ కేంద్రం నుంచి స్థానిక పంపుల చెరువు ద్వారా గోదావరి నీటిని ప్రజలకు అందిస్తామన్నారు. ప్రస్తుతం 38 ఎంఎల్‌డి నీటి జలాలు నగర ప్రజలకు అందిస్తున్నామని అదనంగా 20 ఎంఎల్‌డి గోదావరి జలాలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. వన్‌టౌన్‌లో విలీనమైన గ్రామాలకు పోణంగిలో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు ఏర్పాటుకు, రెండో పట్టణ పరిధిలో విలీనమైన గ్రామాలకు సత్రంపాడులో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్‌ అధికారులకు కమిషనర్‌ సూచించారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా నగర ప్రజలకు రెండు పూటలా నీరు అందించేందుకు ముందు జాగ్రత్తగా సంబంధిత అధికారులతో కలిసి తగు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్‌ షాహిద్‌ పేర్కొన్నారు.