ప్రజాశక్తి - కొయ్యలగూడెం
రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలైన విలేకరి వైద్యానికి కొయ్యలగూడెం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రూ.15 వేలు ఆర్థిక సాయం చేశారు. ఈ నెల 24వ తేదీ రాత్రి నల్లచర్ల నుంచి కొయ్యలగూడేనికి వెళ్తున్న విలేకరి తప్పెట్ల శ్రీనివాస్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయమైంది. శ్రీనివాస్‌ను స్థానికులు కొయ్యలగూడెం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం రాజమండ్రి ఆసుపత్రికి తరలించగా వైద్యులు తలకు శస్త్రచికిత్స చేయాల్సి ఉందని తెలిపారు. దీంతో తోటి విలేకర్లు రోటరీ క్లబ్ దృష్టికి తీసుకెళ్లగా రూ.15 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా కొయ్యలగూడెం రోటరీ అధ్యక్షులు సిరివెళ్ల సుబ్రహ్మణ్యం, కార్యదర్శి సంకు కొండ మాట్లాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విలేకరి తప్పెట్ల శ్రీనివాస్ క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. దాతలు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక మీడియా ప్రతినిధులు, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.










