ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా బుధవారం ఏజెన్సీలో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర మండల కేంద్రంలో ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ యాత్రను భగవాన్ బిర్సా ముండా జన్మ స్థలమైన జార్ఖండ్‌లోని ఖుంటి నుంచి ప్రారంభించగా, వీడియో కాన్ఫరెన్స్‌లో దేశ వ్యాప్తంగా ప్రసారం చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ప్రత్యేక అధికారి శోబిత్ గుప్త, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణుచరణ్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే లక్ష్యంగా యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన 'సమాచారం, విజ్ఞానం, వ్యక్తీకరించడం' ప్రాతిపదికగా ప్రచార వాహనం ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా పారిశుధ్య సౌకర్యాలు, అవసరమైన ఆర్థిక సేవలు, విద్యుత్ కనెక్షన్లు, గ్యాస్ సిలిండర్ల సదుపాయం, పేదలకు గృహాలు, ఆహార భద్రత, సరైన పోషకాహారం వంటి సంక్షేమ పథకాలను కేంద్రప్రభుత్వం అందించిందన్నారు. వన్ ధన్ వికాస్ కేంద్రానికి రూ.25 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. జిల్లాలో గిరి పుత్ర బ్రాండ్ కింద అటవీ ఉత్పత్తులను మార్కెటింగు చేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు అర్హత కలిగి ఇంకా నమోదు కాకపోతే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో వెంటనే నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రచార రథం రోజుకు రెండు పంచాయతీల్లో పర్యటించి అవగాహన కల్పిస్తుందని చెప్పారు. ప్రత్యేక అధికారి శోబిత్ గుప్త మాట్లాడుతూ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించేందుకు ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నారు. నాబార్డు డిడిఎం నాగార్జున, లీడ్ బ్యాంక్ మేనేజర్ జెఎల్‌ఎన్ మూర్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బగాది జగన్నాథరావు, డిఆర్‌డిఎ పీడీ పి.కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్, జిల్లా పరిశ్రమల అధికారి ఎం.వి.కరుణాకర్, కృషి విజ్ఞాన్ కేంద్రం అధికారులు సంబంధిత సంక్షేమ పథకాలను వివరించారు. ప్రకృతి వ్యవసాయంపై కప్రక దీప, వన్ దన్ వికాస్ కేంద్రం (విడివికె) గురించి టి.శ్రీహరి మాట్లాడారు. అనంతరం వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రచార వాహనాన్ని కలెక్టర్ నిశాంత్ కుమార్, భారత ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి శోబిత్ గుప్త జెండా ఊపి ప్రారంభించారు.ఉజ్వల లబ్ధిదారులకు గ్యాస్ సిలెండర్ మంజూరు పత్రాలు, వివిధ పథకాల కింద చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నోడల్ అధికారి, డిపిఒ బలివాడ సత్యనారాయణ, ఆర్‌డిఒ ఎం.లావణ్య, జిసిసి డివిజనల్ మేనేజర్ వి.మహేంద్ర కుమార్, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఒ. ప్రభాకర రావు, డిఇఒ ఎన్. ప్రేమ్ కుమార్, జిల్లా మత్స్య శాఖ అధికారి వి.తిరుపతయ్య, జిల్లా గిరిజన సంక్షేమాధికారి కె.శ్రీనివాస రావు, డిఎస్‌ఒ శివప్రసాద్ తదితరులు హాజరయ్యారు.