Mar 16,2023 23:52

మాట్లాడుతున్న డిఇఒ వెంకట లక్ష్మమ్మ

ప్రజాశక్తి-చోడవరం
ప్రపంచంలో ప్రముఖ మేధావులు, శాస్త్రజ్ఞుల్లో పలువురు వికలాంగత్వం కలిగి ఉన్నవారేనని, వికలాంగ పిల్లల్లో ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించగలిగితే అద్భుతాలు సృష్టిస్తారని జిల్లా విద్యాశాఖ అధికారిణి వెంకట లక్ష్మమ్మ అన్నారు. గురువారం చోడవరం జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన వికలాంగుల ఉపకరణ వైద్య నిర్ధారణ శిబిరంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలకు ప్రథమ గురువు తల్లి మాత్రమేనని తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ వికలాంగుల అభివృద్ధిలో కీలకపాత్ర వహించాల్సింది తల్లిదండ్రులేనని పేర్కొన్నారు. జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వసంత మాట్లాడుతూ వికలాంగ బాలబాలికలను ప్రతిరోజు పాఠశాలకు పంపించినట్లయితే వారు సమాజంలో భాగస్వామ్యం కావడం సులభమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహిత విద్యా సమన్వయకర్త వసంత, ప్రత్యేక ఉపాధ్యాయులు అప్పలరాజు, మహాలక్ష్మి నాయుడు, దేవుడు బాబు, వర ప్రసాదు, రిసోర్స్‌ ఉపాధ్యాయులు జగన్నాథం నాయుడు, పోలిరాజు, దేముడు నాయుడు, కెవిఎం నాయుడు, వివిధ మండలాల నుంచి తల్లిదండ్రులు, వికలాంగబాలబాలికలు పాల్గొన్నారు.
పాఠశాలను సందర్శించిన డిఇఒ
అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి వెంకట లక్ష్మమ్మ గురువారం చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా లెర్నింగ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ కార్యక్రమం, బైజూస్‌ ట్యాబ్‌లో వినియోగం, మన బడి నాడు నేడు కార్యక్రమం అమలును ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుని పరిశీలించారు. విద్యార్థుల ట్యాబ్‌ల వినియోగం పెంచమని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులందరూ కష్టపడి చదివి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పాఠ్యాంశాలపై ఏమైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయుల వద్ద వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. అనంతరం జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో నాల్గవ తరగతిని సందర్శించి, తరగతిలో అమలు జరుగుతున్న టీచింగ్‌ ఎట్‌ రైట్‌ లెవెల్‌ అమలును, గ్రేడింగ్‌లను పరిశీలించారు. విద్యార్థుల జ్జానం, అవగాహనను పరిశీలించడానికి పలుకు ప్రశ్నలు వేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, మండల విద్యాశాఖాధికారి శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు డి.వసంత మరియు సిఆర్‌పి కెవియమ్‌.నాయుడు పాల్గొన్నారు.