Aug 12,2023 17:00

ప్రజాశక్తి - భీమడోలు
    గుండుగొలను కేంద్రంగా పనిచేస్తున్న శ్రీవిఘ్నేశ్వర వికలాంగుల సేవా సమితి తమ నెలవారీ కార్యక్రమాల్లో భాగంగా శనివారం గ్రామపంచాయతీ పరిధిలోని సుమారు 60మంది వికలాంగులకు నిత్యావసరాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ మేరకు దీనికి అవసరమైన రూ.25వేల విరాళాన్ని గ్రామానికి చెందిన దాతలు కొనగళ్ళ మోహనరావు, కొనగళ్ళ అనంత్‌ సమకూర్చారు. పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ రామవరప్పాడు కేంద్రంగా పనిచేసే తెర్లి క్లీనిక్‌కు చెందిన గుండె, ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్‌ సురేష్‌, డాక్టర్‌ భానురేఖ వికలాంగులకు అందజేశారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న సదరు డాక్టర్‌ దంపతులు స్థానిక వికలాంగుల సంక్షేమానికి ప్రతి నెలా వైద్య శిబిరం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. సేవా సమితి అభ్యున్నతికి తమ వంతు సహాయ సహకారాలను పలు రూపాల్లో అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భీమడోలు ఎస్‌ఐ చావా సురేష్‌, సామాజిక కార్యకర్త టి.సుమన్‌ బాబుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.