ప్రజాశక్తి - చింతలపూడి
మానసిక వికలాంగులను చులకన భావంతో చూడకూడదని, వారి పట్ల సానుభూతి, సహాయ సహకారాలు అందించాలని చింతలపూడి జూనియర్ సివిల్ న్యాయమూర్తి సి.మధుబాబు కోరారు. ప్రపంచ మానసిక వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఎంపియుపి పాఠశాలలో భవిత ప్రత్యేక అవసరాల గల పిల్లల శిక్షణా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. పిల్లల తల్లిదండ్రులకు, టీచర్స్‌కు మానసిక, శారీరక వికలాంగులకు ఉన్న హక్కుల గురించి వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హఫీజా మాట్లాడుతూ మనసిక రోగం అనేది తగ్గేదేనని, దానికి కుటుంబ సభ్యుల సహకారం, సమాజం సహకారం ఉండాలని తెలిపారు. మానసిక వికలాంగులకు న్యాయ సేవల ద్వారా వారికి మెరుగైన వైద్యం ఇప్పించవచ్చన్నారు. అలాగే వారికి సంబంధించిన ఆస్తుల విషయంలో కూడా వారికి న్యాయ సహకారాలు అందిచవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు లక్కపాము వెంకట చైతన్య, పింగుల డేవిడ్ రాజు, బుల్లా ఏసుపాదం, సోషల్ వర్కర్ ఎమ్‌డి అక్బర్ అలీ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హాఫిజా, మండల విద్యాధికారి, రామరావు, పాఠాశాల ప్రధానోపాధ్యాయులు అప్పలరాజు, భవిత సెంటర్ ఉపాధ్యాయులు భాగ్యలక్ష్మి, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.










