Aug 13,2023 17:41

ప్రజాశక్తి - చింతలపూడి
      తల్లిదండ్రులు పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలనీ, తల్లిదండ్రులు చనిపోయినా వారి పేరిట సమాజ సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని చింతలపూడి సిఐ ఎంవిఎస్‌ మల్లేశ్వరరావు అన్నారు. ఆదివారం చింతలపూడి మసీదు ఆవరణలో అజీమ్‌ ఛారిటీ తరుపున ఛారిటీ ఫౌండర్‌ ఎస్‌కె ఆజాద్‌ ఇద్దరు విభిన్న ప్రతిభావంతులకు ఆర్థిక సాయం, నిత్యావసర సరుకులను ఎస్‌ఐ ప్రసాద్‌ చేతుల మీదుగా అందించారు. పాత చింతలపూడికి చెందిన వికలాంగుడు అజీజ్‌కు రూ.5వేలు ఆర్థికసాయం, షేక్‌ ఖాసిం అనే వికలాంగుడుకు బియ్యం, నిత్యావసర సరుకులను సీఐ మల్లేశ్వరరావు, ఎస్‌ఐ ప్రసాద్‌లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతికి ఉన్నప్పుడు తల్లిదండ్రులను చూడని సమాజంలో, తన తండ్రి అజీమ్‌ మరణించినా ఆయన పేరిట సమాజ సేవా కార్యక్రమాలు ఛారిటీ ఫౌండర్‌ అజాద్‌ చేయడం అభినందనీయం, ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ అధ్యక్షుడు సయ్యద్‌ రహీమ్‌, కార్యదర్శి ఎండి జిలానీ, జమాత్‌ పెద్దలు ఎండి అక్బర్‌ అలి, ముస్లీం పెద్దలు ఎంఎ రజాక్‌, ఖాజా, హాజీ, రబ్బానీ, రఫీ, అల్లా బక్షు, ఇమ్రాన్‌, ఇమ్మాజి, ఇశాక్‌, అమీర్‌ పాషా, లయన్‌ క్లబ్‌ అధ్యక్షుడు జి.రాజేష్‌ నాయుడు పాల్గొన్నారు.