ప్రజాశక్తి-బాపట్ల: వికలాంగులకు న్యాయపరంగా అందాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేయకుండా వైసిపి ప్రభుత్వం వారికి తీరని అన్యాయం చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వికలాంగుల విభాగం అధ్యక్షులు గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం బాపట్ల పట్టణం చీలు రోడ్డు సెంటర్లో తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ విభిన్న ప్రతిభావంతుల విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన వికలాంగుల మహాధర్నాలో గోనుగుంట్ల మాట్లాడారు. వికలాంగులకు జరుగుతున్న అన్యాయాలపై పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంలో వికలాంగులకు సంక్షేమ పథకాలు నిలిపివేయడం దారుణమన్నారు. సకలాంగులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వికలాంగులకు మొండిచేయి చూపుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి రావాల్సిన పెన్షన్లు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిబంధనల పేరుతో వికలాంగులకు పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు నిలుపుదల చేయడం దారుణమని అన్నారు. గత ప్రభుత్వంలో వికలాంగుల అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు, వారికి సౌకర్యంగా ఉండేలా ట్రై సైకిల్, మోటర్ వాహనాలు, వివాహ ప్రోత్సాహకాలు, ఉపాధి కల్పనకు సబ్సిడీపై రుణ సదుపాయం కల్పించి ఆదుకుందన్నారు. కార్యక్రమానికి సహాయ సహకారాన్ని అందించిన బాపట్ల నియోజకవర్గ టిడిపి బాధ్యులు వేగేశన నరేంద్రవర్మకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల పార్టీ వికలాంగుల సంఘం నాయకుడు విజరుకుమార్, పార్టీ నాయకులు పల్లం సరోజిని, స్థానిక వికలాంగ నాయకులు, బాపట్ల, రేపల్లె, వేమూరు, చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.










