ప్రజాశక్తి-బాపట్ల: వికలాంగులకు విద్యతోపాటు వారి ప్రత్యేక అవసరాల కోసం అవసరమైన ఉపకరణాలను అందజేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి పివిజె రామారావు అన్నారు. ఆదివారం బాపట్ల ఏబీఎం హైస్కూల్లో ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపకరణాలు అందజేతకు నిర్వహించిన ఉచిత వైద్య పరీక్ష శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రామారావు మాట్లాడుతూ సమగ్ర శిక్షణ ద్వారా వికలాంగ పిల్లలకు అందుతున్న పరికరాలు, అలవెన్సుల వివరాలను వెల్లడించారు. బాపట్ల జిల్లా స్థాయిలో ప్రత్యేక అవసరాల పిల్లలకు ఇక్కడ నిర్వహించిన వైద్య శిబిరంలో పరీక్షల అనంతరం 48 మందికి వినికిడి పరికరాలు, 16 వీల్ చైర్లు, 12 టీడబ్ల్యూఎం కిట్లు అవసరమైన వారిని నిర్ధారించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సమన్వయకర్త జి నాగేంద్రమ్మ, సైకాలజిస్ట్ కోటేశ్వరరావు, ఆడియాలజిస్ట్ లాస్య, గేశ్వరరావు, ఫిజియో థెరపిస్ట్ శ్రీధర్, స్కూల్ అసిస్టెంట్లు, ఈఆర్‌పి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










