ప్రజాశక్తి-పంగులూరు: మా అబ్బాయి పూర్తిగా వికలాంగుడు, మంచం మీద నుంచి లేవలేడు. ప్రభుత్వం వికలాంగుల కోటాలో రూ.5 వేల పింఛన్ ఇస్తుంటే, గ్రామంలో కొంతమంది కావాలనే ఆ పింఛన్ రాకుండా అడ్డుకున్నారని జాగర్లమూడివారిపాలెం దళిత కాలనీకి చెందిన వికలాంగుడు తెలగతోటి మహేంద్ర తల్లి శివ, నాయనమ్మ కాంతమ్మ వైసిపి అద్దంకి ఇన్‌ఛార్జి బాచిన కృష్ణ చైతన్యకు ఫిర్యాదు చేశారు. మా అబ్బాయికి పింఛన్ వచ్చే విధంగా చేయాలని కోరారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా, గురువారం సాయంత్రం వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, శాప్ నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య, మండలంలోని జాగర్లమూడివారి పాలెం దళితవాడకు వెళ్ళాడు. ఆ కాలనీలో 24 సంవత్సరా ల వయసుగల తెలగతోటి మహేంద్ర అనే యువకుడు, అంగవైకల్యంతో ఏళ్ల తరబడి మంచంలోనే ఉంటున్నాడు. ఆ వ్యక్తిని కృష్ణ చైతన్య పలకరించారు. ఈ సందర్భంగా మహేంద్ర తల్లి శివ, నాయనమ్మ కాంతమ్మలు, మహేంద్ర పరిస్థితిని గురించి కృష్ణ చైతన్యకు వివరించారు. ప్రభుత్వం ఇచ్చే పింఛనే మహేంద్రకు ఆధారమని చెప్పారు. అలాంటి పింఛన్‌ను గ్రామంలోని కొంతమంది కావాలని పించన్ రాకుండా చేశారని, పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని కష్ణ చైతన్య కోరారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ, వచ్చే నెల నుంచి మహేంద్రకు రూ.5 వేల పింఛను వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని, అధికారులతో మాట్లాడి పింఛను ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రాయిని ప్రమీల, మండల ఉపాధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ రెడ్డి, మండల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రాయని వెంకటసుబ్బారావు, స్థానిక వైసీపీ నాయకులు జాగర్లమూడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










