ప్రజాశక్తి -పిఎం పాలెం : జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులైన పిల్లల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమానికి అధికారులు చేపడుతున్న చర్యలపై బక్కన్నపాలెంలోని టిసిపిసి సెంటర్‌లో ఎపి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో 18 ఏళ్లులోపు వికలాంగ పిల్లలు ఎంతమంది, వారిని ఎన్ని రకాలుగా గుర్తించారు, ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు, జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు, వారికి అందిస్తున్న ఉపకరణాలు వంటి వివరాలను సంబంధితశాఖ ఎడి ఆర్.మాధవిని అడిగి తెలుసుకున్నారు. వికలాంగ బాలల కోసం జిల్లాలో ప్రభుత్వ, స్వచ్ఛందసంస్థల అధీనంలో నిర్వహిస్తున్న పాఠశాలు, అందులోని విద్యార్థుల వివరాలపై ఆరా తీశారు..
ఈ సందర్భంగా కమిషన్ సభ్యుడు సీతారాం మాట్లాడుతూ సమీక్షలో పిల్లల సంక్షేమం, హక్కులతో ముడిపడి ఉన్న అనేక సమస్యలు, ప్రాధాన్యతలు గుర్తించామని, పరిష్కారానికి కమిషన్ చైర్‌పర్సన్ కె.అప్పారావు సారథ్యంలో రాష్ట్ర ఉన్నతాధికారులు,జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులకు సిఫారసులు, ఆదేశాలు జారీచేస్తామన్నారు.
సమావేశంలో జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ ఎంఆర్‌ఎల్.రాధ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి సత్యన్నారాయణ, సిడిపిఒ ఎం.శ్రీదేవి, సూపర్‌వైజర్‌లు బి.సరిత, ఎ.లక్ష్మి, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఎం.రమేష్, ఐసిపిఎస్ ప్రతినిధి ఎ.ఆనంద్‌పాల్గొన్నారు.










