ప్రజాశక్తి-సీతమ్మధార : వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు అన్నారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖ రాజధాని ఉత్తరాంధ్ర ప్రజలు హక్కు అన్నారు. మూడు రాజధానులు ఏర్పాటుకోసం విజయదశమి రోజున ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో అభివృద్ధి అంతా హైదరాబాదులోనే జరగడం వల్ల రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్‌ని కోల్పోయి చాలా నష్టపోయిందని, మరొకసారి అలాంటి తప్పు పునరావృతం కాకూడదని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. టిడిపి నాయకులు అమరావతి రాజధాని పేరుతో చేస్తున్న పాదయాత్రను అడ్డుకుంటామని తెలిపారు.
నేడు ప్రత్యేక పూజ
పరిపాలనా రాజధానికి మద్దతుగా బుధవారం తాటిచెట్లపాలెంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు తెలిపారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక పూజా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. త్వరలో జరగబోయే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటు నమోదు చేయించాలన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా సీతంరాజు సుధాకర్ గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, స్టాండింగ్ కమిటీ మెంబర్ బర్కత్ ఆలి, కార్పొరేటర్లు కె.అనీల్‌కుమార్‌రాజు, సాడి పద్మారెడ్డి, ఆళ్ల లీలావతిశ్రీనివాస్, కెవిఎన్.శశికళ, కో-ఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు, మాజీ కార్పొరేటర్లు కె.వెంగళరావు, పోతు సత్యనారాయణ, వార్డు అధ్యక్షులు నీలి రవి, పైడి రమణ, పీలా వెంకటలక్ష్మి, కెపి.రత్నాకర్, నాయకులు చిరంజీవి, బొడ్డెటి కిరణ్, షేఖ్ బాబ్జి, కె.చిన్నా, జక్కంపూడి సత్యనారాయణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










