ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
దేశం అభివృద్ధి చెందాలంటే సర్వ మతాలు కలయికతో పాటు, మతసామరస్యాన్ని కాపాడుకోవటం మనందరి కర్తవ్యమని, ఇస్లాంలోని మహమ్మద్ ప్రవక్త బోధించిన క్రమశిక్షణ, సేవా, దాతృత్వం వంటి విషయాలు నేటికీ అందరికీ ఆచరణీయమని వికాస్ విద్యా సంస్థల ఛైర్మన్ వి.జగన్ అన్నారు. శుక్రవారం వికాస్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో రంజాన్ మాస ఉపవాసాల నేపథ్యంలో ముస్లిం సోదరులు సుమారు 300 మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. స్థానిక బిలాల్ మసీదు ఆవరణలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ దేశ సమైక్యత సమగ్రతను కాపాడుకోవాలన్నారు. నేటి యువతరం మత సమరస్యాన్ని ఆచరించాలని తెలిపారు. పట్టణంలోని ఏ మంచి కార్యక్రమానికి అయినా రానున్న కాలంలో వికాస్ విద్యాసంస్థల సహకారం ఉంటుందని తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం సంతోషం కలిగించిందన్నారు. ముస్లిం సోదరుల ందరికీ ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వికాస్ విద్యాసంస్థలు కరస్పాండెంట్ సౌజన్యలక్ష్మి, డీన్ కె.సత్యం, సీనియర్ సోషల్ యాక్టివిస్ట్ నేలటూరి మోహన్, ప్రిన్సిపల్ కిషోర్, ఎజిఎం కె.సురేష్, ధనరాజు, చిట్టిబాబు పాల్గొన్నారు.
బుట్టాయగూడెం : బుట్టాయగూడెం మసీద్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు పాల్గొన్నారు. ఆయనతో పాటు మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీ, టి.నరసాపురం జెడ్‌పిటిసి సభ్యులు సూరిబాబు, సొసైటీ అధ్యక్షులు ఆరేటి సత్యనారాయణ, వైస్ ఎంపిపి మోహనరావు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.
ద్వారకాతిరుమల : రంజాన్ నెలలో ఉపవాస దీక్షలున్న ముస్లిం సోదరులకు శుక్రవారం రాత్రి ద్వారకాతిరుమల గ్రామంలో చెరువు వీధిలో ఉన్న మసీదులో టిడిపి బిసి సెల్ అధ్యక్షుడు శ్రీ రేవూరి వెంకటేశ్వరరావు, టిడిపి నాయకులు మట్టపర్తి రూపేష్‌కుమార్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. మండలంలోని ముస్లిం సోదరులకు రంజాన్ శుభకాంక్షలు తెలిపారు.










