ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్ : సామాజిక భద్రత కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సురక్ష క్యాంపులు జిల్లాలోని అన్ని మండలాల్లోనూ విజయవంతం మైందని కలెక్టర్ నిశాంత్‌కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నెలరోజుల పాటు పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులతో పాటు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు చేసిన అవిరాళ కృషి వల్ల సురక్ష కార్యక్రమం విజయవంతమైందన్నారు. నిర్ణీత కార్యాచరణ ప్రకారం వారం రోజులు మందుగా వాలంటరీ వ్యవస్ధ ద్వారా పౌరుల అపరిష్కృత సమస్యలను గుర్తించి, వారికి ప్రత్యేక టోకెన్ కేటయించి, 11 రకాల ధ్రువపత్రాలను గ్రామస్ధాయిలోనే మంజూరు చేశామని చెప్పారు. పార్వతీపురం, పాలకొండ డివిజన్‌లో దాదాపు 96శాతం దరఖాస్తులను పరిష్కరించామన్నారు. సమస్యల పరిష్కారానికి జిల్లా వ్యాప్తంగా 133684 టోకెన్‌లు మంజూరు చేయగా, అందులో 127493మందికి సేవలు అందించామని, 122300 దృవపత్రాల మంజూరు చేశామని, మిగతా వాటికి కూడా క్షేత్రస్ధాయిలో పరిశీలన జరిపి 15రోజుల్లో పరిష్కారం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతానికి శ్రమించిన అన్ని శాఖల వారికి అభినందనలు తెలియ జేస్తున్నట్లు కలెక్టర్ తెలియజేశారు.










