విజయవంతంగా 'జగనన్న సురక్ష'
ప్రజాశక్తి-అల్లూరు : రాష్ట్రంలో జగనన్న సురక్ష పథకం విజయవంతంగా ముందుకు దూసుకు వెళ్తుందని కావలి ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రం స్థానిక ఆర్‌డిఆర్ కాలనీలో ఆయన విస్తృత పర్యటన చేపట్టి ప్రజలతో మమేకమై ప్రతి ఇంటికి వెళ్లి ఆయా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ అన్ని సచివాలయ పరిధిలో వైసిపి నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే అల్లూరు, దగదర్తి, కావలిలో పర్యటించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు విరివిగా అమలవుతున్నాయని తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని జన్మభూమి కమిటీల పెత్తనం అధికంగా ఉందని గుర్తు చేశారు. జగనన్న సురక్ష పథకం ద్వారా రూపాయి ఖర్చు లేకుండా అన్ని సర్టిఫికెట్లు ఉచితంగా మంజూరు చేస్తున్నామని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మాజీ మంత్రి అనిల్‌కుమార్ ఇటీవల చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారని ఎంఎల్‌ఎగా 2 దఫాలు ప్రజల ఓట్లతో ఎన్నుకోబడ్డారని కాగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంఎల్‌సి కోటాలో దొడ్డిదారిన మంత్రి అయిన లోకేష్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఈ రాష్ట్రంలో వైసిపి 175 కి 175 సీట్లు సాధించి మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు బిజెపి, జనసేన తోక పార్టీలతో కుమ్మక్కై తోడేళ్లను వెంటబెట్టుకొని సింహం లాంటి జగన్మోహన్ రెడ్డిని జయించాలని చూస్తున్నారంటూ చలోక్తులు విసిరారు. ప్రజలందరూ అభివృద్ధిపై మొగ్గు చూపుతున్నారని 2024లో విజయం తమదేనని ధీమా వ్యక్తపరిచారు. అనంతరం చెత్త డబ్బాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కావలి ఆర్‌డిఒ శీనా నాయక్, తహశీల్దార్ చంద్రశేఖర్, ఎంపిడిఒ శ్రీదేవి, వైసిపి సీనియర్ నాయకులు నీలం సాయికుమార్, ఎఎంసి వైస్ చైర్మన్ ఊటు శ్రీకాంత్ రెడ్డి, మేడా కృష్ణారెడ్డి, దర్శిగుంట వెంకయ్య, నార్త్ ఆములూరు సర్పంచ్ షేక్ కరిముల్లా షా ఖాదర్, దాసరి పోలయ్య, పంచాయతీ కార్యదర్శి వర ప్రసాద్ తదితరులున్నారు.










