త్రిఫ్ట్‌సొసైటీ, విసిసి ఆధ్వర్యాన నిర్వహణ
ఉత్సాహంగా పాల్గొన్న సొసైటీ సభ్యుల పిల్లలు
ప్రజాశక్తి-ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ త్రిఫ్ట్ సొసైటీ, వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యాన సొసైటీ సభ్యుల పిల్లలకు రెండు రోజుల పాటు నిర్వహించిన సమ్మర్ క్యాంప్ విజయవంతమైంది. ఆదివారం ఉక్కునగరం సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో స్టీల్‌ప్లాంట్ పరిసర ప్రాంతాల నుంచి 70 మంది సొసైటీ సభ్యుల పిల్లలు పాల్గొని ఉత్సాహంగా గడిపారు. ఈ క్యాంపులో సమాజ పరిణామ క్రమం, శాస్త్రీయ ఆలోచన, నిత్యజీవితంలో సైన్సు, ఆచరణ, పిల్లల కోసం ఎందుకు పనిచేయాలి అనే అంశంపై వివరించారు. దీనితో పాటు గ్రూపు ఆక్టీవిటీలు, మైమ్, క్రాఫ్ట్, డాన్సు, పాటలు, పొడుపు కథలు విప్పి చెప్పడం వివిధ రకాలైన అంశాల్లో అవగాహన పోటీలను నిర్వహించారు. విజ్ఞాన అంశాలను డిసిహెచ్. వెంకటేశ్వరరావు, ఎవి.సత్యనారాయణ వివరించారు. విసిసి కన్వీనర్ కె. సుశీల, కె. రమాప్రభ పర్యవేక్షణలో కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా సొసైటీ సెక్రటరీ పి నారాయణరావు మాట్లాడుతూ పిల్లలకు విజ్ఞానంతోపాటు వినోదాన్ని అందించే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు రూపొందించామని వెల్లడించారు. పిల్లల్లోని ప్రతిభను గుర్తించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.సమ్మర్ క్యాంపులో పాల్గొన్న పిల్లలకు విసిసి తరఫున జ్ఞాపికలు అందజేశారు. డైరెక్టర్లు కె.సత్యవతి, ఎ.అప్పారావు, జి.శ్రీనివాస్, డి.ప్రవీణ్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో నమ్మిదోడ్డి, పరవాడ, వడ్లపూడి, గంట్యాడ, శ్రీనగర్, మదీనాబాగ్, ఇస్లాంపేట, లక్మినగర్, శ్రీరాంనగర్ ప్రాంతాల పిల్లలు పాల్గొన్నారు.










