Aug 03,2023 17:48

ప్రజాశక్తి - జంగారెడ్డగూడెం
       చింతలపూడి నియోజకవర్గంలో ఉన్న 90 సచివాలయాల ద్వారా జగనన్న సురక్ష కార్యక్రమంలో 61,179 ధృవ పత్రాలు పంపిణీ చేయడం జరిగిందని ఎంఎల్‌ఎ ఎలిజా తెలిపారు. గురువారం స్థానిక ఎంఎల్‌ఎ క్యాంప్‌ కార్యాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతంపై హర్షం వ్యక్తం చేస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి దేశంలో ఎక్కడా జగనన్న సురక్ష మాదిరిగా ప్రభుత్వ అధికారులు, పాలనను ప్రజల వద్దకు తీసుకువెళ్లడం జరగలేదని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పాలనను ముఖ్యమంత్రి జగన్‌ గ్రామస్థాయికి అందించారన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా 1.46 కోట్ల గృహాలు సర్వే చేయడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 93.51 లక్షల మందికి ధృవపత్రాలు జారీ చేయడం జరిగిందన్నారు. జగనన్న సురక్ష ద్వారా ప్రజలకు మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ బత్తిన నాగలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ రీజినల్‌ ఛైర్మన్‌ వందనపు సాయి బాల పద్మ, వైసిపి పట్టణ అధ్యక్షులు పిపిఎన్‌ చంద్రరావు, బత్తిన చిన్న పాల్గొన్నారు.
భూ కబ్జాలను అరికడతాం
ఇటీవల పట్టణంలో పలువురిని కలవరపాటుకు గురి చేస్తున్న భూ కబ్జాలను వెల్లడి చేస్తే అధికారులను ఆదేశించి అరికడతామని ఎంఎల్‌ఎ ఎలిజా అన్నారు. ఇటీవల పట్టణంలో వివాదాస్పదమైన భూ కబ్జాల సమస్యను స్థానిక కార్యకర్తలు ఎంఎల్‌ఎ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన భూ కబ్జా జరిగిందంటే ఎవరో ఒకరికి అన్యాయం జరుగుతుందని అన్నారు. సామాన్యులకు నష్టం కలుగకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అధికారులు, ప్రభుత్వంపై ఉందన్నారు. అలాగే ఫామాయిల్‌ ఫ్యాక్టరీ వ్యర్థాలపై సమస్యను పరిష్కరించాలని అడుగగా ఈ సమస్య తన దృష్టికి వచ్చిందని తెలిపారు. తగిన విధంగా పరిష్కారం చేయడానికి కృషి చేస్తానన్నారు.