Dec 27,2022 22:55

ప్రజాశక్తి-విజయవాడ, జగ్గయ్యపేట
విశాఖ ఉక్కు పరిరక్షణ పాదయాత్ర విజయవాడకు చేరుకుంది. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు విశాఖపట్నం నుంచి తిరుపతికి పాదయాత్ర చేపట్టారు. ఈ నెల 16న విశాఖ స్టీల్‌ ఉద్యోగులు రామారావు, విష్ణు, శ్రీనివాసులు చేపట్టిన పాదయాత్ర సోమవారం సాయంత్రం విజయవాడకు చేరింది. ఈ సందర్భంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమానికి జేఎల్‌ఎం ఉద్యోగులు, సిఐటియు నేతలు విజయవాడలో సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాదయాత్రగా వచ్చిన నేతలు రామారావు, విష్ణు ,శ్రీనివాసు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం తాము ఆ శ్రీనివాసుని దయ కోసం విశాఖ నుంచి తిరుమలకి పాదయాత్ర చేపట్టామని అన్నారు. ఈ నెల 16న వైజాగ్‌ లో ప్రారంభించిన పాదయాత్ర వచ్చే నెల సంక్రాంతి నాటికి తిరుపతి చేరుతుందని తెలిపారు. 11 రోజులకు విజయవాడ చేరామని, అడుగడుగునా తమకు స్థానిక ప్రజలు, ఉద్యోగ సంఘాల నేతలు మద్దతు ఇస్తున్నట్టుగా తెలిపారు. 12వ రోజున మంగళవారం విజయవాడ నుంచి ప్రారంభమైన పాదయాత్రలో జగ్గయ్యపేట లైమ్‌ స్టోన్‌ ఉద్యోగ సంఘాల నేతలు పి రామకష్ణ రాజు,దేవోజి, హేమానాయక్‌, జె వి ఎస్‌ డి ప్రసాద్‌, ఎం సురేష్‌ కుమార్‌, విక్రం, ఎమ్‌ రాంప్రసాద్‌,సారథి అలానే స్టీల్‌ ప్లాంట్‌ విశ్రాంత ఉద్యోగులు టి శ్రీమన్నారాయణ, బి భీమరాజు,ఎస్‌.కె అజామ్‌, ఫిలిప్స్‌, సిఐటియు జిల్లా నేత నగేష్‌ బాబు శ్రీనివాసరావు ఈ పాదయాత్రలో పాల్గొని వారితో కలిసి గుంటూరు శివారు వరకు నడిచారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట లైవ్‌ స్టోన్‌ ఉద్యోగులు ఎన్టీఆర్‌ జిల్లా సిఐటియు అధ్యక్షులు ఏ వెంకటేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శి ఎం శ్రీనివాసరావు, సిఐటియు తూర్పు నగర కార్యదర్శి ఎన్‌ కోటి పాల్గొన్నారు.