Nov 13,2023 20:45

ప్రజాశక్తి - భీమవరం
ఈ నెల 15వ తేదీన విజయవాడలో జరిగే సిపిఎం భారీ బహిరంగ సభకు తరలిరావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం విజ్ఞప్తి చేశారు. సిపిఎం రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ప్రజారక్షణ భేరి యాత్రలు సోమవారంతో ముగిశాయని చెప్పారు. స్థానిక మెంటేవారితోటలోని సుందరయ్య భవన వద్ద ప్రచార భేరికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. నెల రోజుల నుంచి సిపిఎం ఆధ్వర్యంలో ప్రజలు ఎదుర్కొనే అనేక సమస్యలపై ప్రచారం చేశామన్నారు. జిల్లాలో 6 పట్టణాలు, 20 మండలాలు, 400 గ్రామాల్లో విస్తృతంగా ప్రజా ప్రణాళికతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు వివరించామని తెలిపారు. ముగింపు సందర్భంగా విజయవాడలో బుధవారం పెద్ద ఎత్తున లక్షలాదిమందితో ప్రజా ప్రదర్శన, వేలాదిమందితో బ్రహ్మాండమైన రెడ్‌ కవాతు ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేలా ఈ బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సభలో సిపిఎం అఖిల భారత అగ్రనేతలు సీతారాం ఏచూరి, బివి.రాఘవులు పాల్గొంటారని తెలిపారు. రైతుల ధరలకు సరైన గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. కౌలు రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తిదారుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమాజంలో సామాజిక న్యాయాన్ని కాపాడాలని, మహిళలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బలహీన వర్గాలకు రక్షణ కల్పించాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. బిజెపి రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే వైసిపి మద్దతు పలకడం దారుణమన్నారు. టిడిపి, జనసేన కూడా మోడీతో జతకట్టడం అంటే అధికారం కోసం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. బిజెపి, వైసిపి ప్రభుత్వాలు కార్పొరేట్ల అనుకూలమైన విధానాలను అవలంబిస్తున్నాయని విమర్శించారు. వీటికి ప్రత్యామ్నాయంగా సిపిఎం ప్రజా ప్రణాళికను రూపొందించిందని తెలిపారు. సిపిఎం చేపట్టిన భారీ బహిరంగ సభకు ప్రజలందరూ తరలిరావాలని బలరాం విజ్ఞప్తి చేశారు. బలరాంతో పాటు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు కె.రాజా రామ్మోహన్‌ రారు, ఎం.వైకుంఠరావు, డి.పెద్దిరాజు, నాయకులు గంగరాజు పాల్గొన్నారు.
అసమానతలు లేని అభివృద్ధి నినాదంతో సిపిఎం చేపట్టిన ప్రజారక్షణ భేరి మహా ప్రదర్శన, బహిరంగ సభకు ప్రజలంతా తరలిరావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. పట్టణంలోని మెంటేవారితోటలోని సుందరయ్య భవనంలో సోమవారం విజయవాడ బహిరంగ సభకు సంబంధించి వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించి బలరాం మాట్లాడారు. ఈ నెల 15వ తేదీ బుధవారం విజయవాడలోని బిఆర్‌టిఎస్‌ రోడ్డు నుంచి ఉదయం 10 గంటలకు మహా ప్రదర్శన ప్రారంభమౌతుందని తెలిపారు. 11 గంటలకు ఎంబి స్టేడియం (అజిత్‌సింగ్‌ నగర్‌)లో బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. ఈ సభకు ముఖ్యవక్తలుగా సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి రాఘవులు హాజరౌతారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రదర్శన, సభ జరుగుతోందన్నారు. బిజెపి ప్రభుత్వం దేశానికి, రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందన్నారు. బిజెపికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రాష్ట్రానికి బిజెపి ఇంత అన్యాయం చేస్తున్నా వైసిపి ప్రభుత్వం మద్దతు పలకడం సిగ్గుచేటన్నారు. అలాగే టిడిపి, జనసేన కూడా బిజెపికి మద్దతు తెలపడం సరికాద న్నారు. ఇప్పటికైనా వారి వైఖరి మార్చు కోవా లన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే ఈ ప్రదర్శన, బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని సిపిఎం తరపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర కార్మిక చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు బి.వాసుదేవరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. ఈ నెల 15న చలో విజయవాడ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వం ధరలను అరికట్టడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ రంగాన్ని మూసివేసి నిరుద్యోగాన్ని పెంచుతుందని, ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె.సత్యనారాయణ, కె.రమణ, అడబాల రాజు, వీరవెల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
పెనుగొండ : ఈ నెల 15వ తేదీన విజయవాడలో జరగనున్న ప్రజా రక్షణ భేరి సభను జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు కోరారు. సోమవారం సిద్ధాంతంలో కార్మికులు, కర్షకుల ఆధ్వర్యంలో నేతలు వాల్‌ పోస్టుర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని సిపిఎం మండల నాయకులు కప్పల రతన్‌రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. రతన్‌ రాజు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దోపిడీని అరికట్టాలన్నారు. కార్యక్రమంలో గుటాల అంబేద్కర్‌, నల్లమిల్లి భాను, చిన్నం శివ, మల్లేశ్వరరావు పాల్గొన్నారు.
భీమవరం రూరల్‌ : అసమానతలు లేని అభివృద్ధి కోసం ప్రజారక్షణ భేరి ఈ నెల 15న జరగనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం మండల కన్వీనర్‌ ఇంజేటి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. తుందూరు గ్రామం చిన్నపేటలో ఉపాధి కార్మికులతో సమావేశం నిర్వహించారు. ప్రజా రక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని, ఉపాధి కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కన్వీనర్‌ ఇంజేటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ ఉపాధి కార్మికుల ఉపాధిని దెబ్బ కొడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో పాలపర్తి ప్రసన్న, మేటి మరియమ్మ పాల్గొన్నారు.
పెనుమంట్ర రూరల్‌: పొలమూరులో ప్రజా రక్షణ భేరి విజయవాడ సభకు మహిళలు తరలిరావాలని కోరుతూ సిపిఎం పొలమూరు శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి మహిళకు బొట్టు పెట్టి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో కేతా పద్మజ, భారతి పెచ్చెటి సత్యనారాయణ శాఖ కార్యదర్శి రాపాక ఆశీర్వాదం చింతపల్లి తిరుమలరావు పాల్గొన్నారు.