ప్రజాశక్తి-రాజవొమ్మంగి:బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించి, అమలు చేయాలని ఈ నెల 26న పార్లమెంట్‌లో వైసిపి రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి మాట్లాడడంపై ఎపి ఆదివాసీ గిరిజన సంఘం తీవ్రంగా ఖండించింది. సంఘం ఆధ్వర్యంలో మండలంలోని లోదొడ్డి పంచాయతీ పరిధి కేశవరం గ్రామంలో గురువారం విజయసాయిరెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పార్లమెంట్ ఆమోదించిన అటవీ సంరక్షణ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షలు, లోదొడ్డి సర్పంచ్ లోతా రామారావు, మండల నాయకులు మేలిన రమేష్ మాట్లాడుతూ, బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చడం సరికాదని, గిరిజనులకు నష్టకలిగించే చర్యలకు వైసిపి పాలకులు పాల్పడడం దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రానున్న ఎన్నికల్లో గిరిజనులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసం గిరిజనుల పొట్టగొడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ విషయంపై వైసీపీ గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు తమ వైఖరి తెలపాలని, లేకుంటే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు మురళి, మనుగుల రాజు, లోతా అర్జున్, కె. కృష్ణ, మేలిన గంగ, లోవకుమారి, రామలక్ష్మి, బాలకొండ తదితరులు పాల్గొన్నారు.
పెదబయలురూరల్:బోయ/వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వైసిపి ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని వెంటనే కేంద్రం ఆమోదించాలని పెద్దల సభలో విజయసాయిరెడ్డి ప్రకటించటాన్ని ఖండిస్తూ మండల కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం పూర్వపు జిల్లా అధ్యక్షులు బొండా సన్నిబాబు మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో ఉన్న మైనింగ్ ని కొల్లగొట్టాలని బోయ/వాల్మీకుల పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తున్నాయన్నారు. ఇందులో భాగంగానే చింతపల్లి ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టును ప్రైవేట్ వ్యక్తులకు కట్ట బెట్టాలని చూస్తున్నారని తెలిపారు. ఇప్పటికే జీవో 3 రద్దుతో మైదాన ప్రాంతం నుంచి అనేకమంది ఉద్యోగులు గిరిజన ప్రాంతానికి వస్తున్నారన్నారు. గిరిజన ప్రాంతంలో వందలాదిమంది గిరిజన నిరు ద్యోగులకు ఉద్యోగాలు రాలేదన్నారు. రాజకీయ లబ్ధి పొందాలని వైసిపి ప్రభుత్వం, టిడిపి, బిజెపి పార్టీలు కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు కిల్లో సర్బన్న, స్థానిక సర్పంచ్ పలాస మాధవరావు, స్థానిక సీత గుంట ఎంపీటీసీ కె.బొంజుబాబు, జేఏసీ నాయకులు వెచ్చంగి కొండయ్య, స్థానిక వైస్ సర్పంచ్ బొండా గంగాధరం, పృథ్వీరాజు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కొర్ర కొండబాబు పాల్గొన్నారు.










