వైసిపి గోదావరి జిల్లాల రీజినల్ కో-ర్డినేటర్ మిథున్‌రెడ్డి
ప్రజాశక్తి - కాకినాడరూరల్
విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని వైసిపి గోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆర్‌టిఒ రోడ్డులోని అక్షయ ఫంక్షన్ హాల్లో వైసిపి జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లడారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలన్నారు. అందుకోసం నేతలు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగాలు 2014 నుంచి ఓకే రకంగా ఉన్నాయన్నారు. 2019లో జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని కానివ్వనని సపధం చేసి ఓడిపోయాడన్నారు. ప్రస్తుతం కాకినాడలో యాత్రలో పవన్ కళ్యాణ్ ప్రసంగించిన తీరు అభిమానులను, ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందాలనే విధంగా సాగిందన్నారు. పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలపై అవగాహన లేదని, టిడిపి స్క్రిప్ట్‌నే ఆయన చదువుతారని విమర్శించారు. జనసేన ఎన్నిస్థానాల్లో పోటీ చేస్తుందనేదానిపై ఆయనకే క్లారిటీ లేదన్నారు. ఇక వైసిపిని ఎక్కడ అడ్డుకుంటారని ప్రశ్నించారు. జనసేన 35 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పుకుంటుంటే, 15 సీట్లకు మించి ఇచ్చేది లేదని టిడిపి అంటుందన్నారు. సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం వైసిపిలోకి వస్తానంటే తప్పక ఆహ్వానిస్తామన్నారు. ఏదేమైనా తమ అధినేత జగన్‌దే తుది నిర్ణయమన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత డ్రగ్స్, గంజాయి కేసులు ఎక్కువయ్యయని అనడం సబబు కాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే గంజాయి వాడకం ఎక్కువ ఉండే దన్నారు. గంజాయిని పూర్తిగా నివారించేందుకు పోలీసులు శాఖ కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళఙ్ల పలుకుబడి పెంచుకున్న వారికే ఎంఎల్‌ఎ టిక్కెట్లు ఇస్తానని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. కాకినాడలో సహకార బ్యాంకులు దివాళా తీయించి బ్యాంకుల ముసు గులో వైసిపి నాయకులే ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు అనే విమర్శలపై కాకినాడ రూరల్ ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు సమాధాన మిచ్చారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ఎంఎల్‌సి అనంతబాబు సభపై మాట దాటవేశారు. ఎన్నికల మేనిఫెస్టోపై ఆయన మాట్లాడుతూ ప్రజలకు తమపై నమ్మకం ఉందని అదే నమ్మకంతో అదే నినాదాలతో ప్రజల ముందుకు వెళతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వంగా గీత, ఎంఎల్‌ఎలు చంద్రశేఖర్‌రెడ్డి, జక్కంపూడి రాజా, పెండెం దొరబాబు, పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్, జడ్‌పి చైర్మన్ వేణుగోపాలరావు పాల్గొన్నారు.










