Mar 07,2021 07:13

పౌరాణిక చిత్రాల్లో మనం చూస్తుంటాం. నాయకుడిపై బాణాలు విసురుతుంటే ఒక్కొక్కటి పడిపోతున్న కొద్ది కొత్త కొత్తవి తీస్తుంటారు. అవేవీ పని చేయకుండా పడిపోయిన తర్వాత కథానాయకుడు ఏకంగా బ్రహ్మాస్త్రం తీసి ఒకేసారి ప్రయోగించి శత్రువులను తుత్తునియలు చేస్తాడు. ఇప్పుడు కేరళలో ఎన్నికల రంగం అలాగే వుంది. పినరయి విజయన్‌ నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం మరోసారి ఘన విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలూ పరిశీలనల్లో స్పష్టమవుతున్న కొద్ది...ఒకవైపు నుంచి బిజెపి కేంద్రం ప్రభుత్వం మరోవైపు నుంచి కాంగ్రెస్‌ నాయకత్వం ఏవేవో కృత్రిమ ప్రచారాలతో వాతావరణం కలుషితం చేసేందుకు విఫల యత్నాలు సాగిస్తూనే వున్నారు. విష ప్రచారాలు చేస్తున్నారు. అయితే మీడియా నివేదికల ప్రకారం చూస్తే ఇవన్నీ కూడా పేలని టపాకాయలుగానే తేలిపోతుండగా సిపిఎం, ఎల్‌డిఎఫ్‌లు ముందుకే దూసుకుపోతున్నాయి. ఇప్పటికి దాదాపు నలభైఏళ్ల నుంచి ఎల్‌డిఎఫ్‌ యుడిఎఫ్‌లు ఒకరి తర్వాత ఒకరు అధికారంలోకి రావడం పరిపాటిగా వుంది. 2011 లోనే అచ్యుతానందన్‌ నాయకత్వంలో ఎల్‌డిఎఫ్‌ 68 స్థానాలు పొంది దాదాపు దగ్గరగా వచ్చింది. 2016లో ఎల్‌డిఎఫ్‌ విజయం సాధించింది. ఇప్పుడు గనక మళ్లీ గెలిచి ఆ వరవడిని మొదటిసారి ఛేదించడమంటే అది ద్విగుణీకృత విజయమవుతుంది. ఏషియా నెట్‌, 24 న్యూస్‌ చానెళ్ల సర్వేలో ఎల్‌డిఎఫ్‌ ఎంత గట్టి పోటీలోనైనా విజేతగా రానుందని వెల్లడించాయి. వ్యక్తిగతంగా పినరయి విజయన్‌ మరోసారి ముఖ్యమంత్రి స్థానం చేపట్టడానికి మిగిలిన ప్రత్యర్థి నాయకుల కంటే ఎంతో ముందున్నారని కూడా ప్రజలు అభిప్రాయం చెప్పారు. విజయన్‌ ప్రభుత్వం కరోనా సమయంలో తీసుకున్న సమర్థవంతమైన సహాయ నివారణ చర్యలు, నిత్యావసరాల కిట్‌ల పంపిణీ, సామాజిక పెన్షన్ల పెంపుదల, ఇతర సంక్షేమ పథకాలు ప్రజలు ఎంతగానో అభినందించారు. నిపా వైరస్‌, కోవిడ్‌, దానికి ముందు తుపానులు వంటి ప్రకృతి వైపరీత్యాలను జయప్రదంగా ఎదుర్కోవడంలో ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి దృఢంగా ఎదుర్కొన్నారనే సద్భావం బలపడింది. సర్వే ఫలితాలలో ఇదే ప్రతిబింబించింది.
రెండు సర్వేలూ అనుకూలమే
ఏషియా నెట్‌ సి ఓటర్‌ సర్వే ఎల్‌డిఎఫ్‌ కు 72-78 వరకూ సీట్లు రావచ్చని యుడిఎఫ్‌కు 59-65 వరకే వస్తాయని చెప్పింది. ఈ సర్వేలో 39 శాతం మంది విజయన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటే 18 శాతం ఊమెన్‌ చాందీని ఎన్నుకున్నారు. రమేష్‌ చెన్నితల 6 శాతం తెచ్చుకున్నారు. కరోనాపై పోరాటంలో గట్టిగా నిలిచిన ఆరోగ్యమంత్రి శైలజకు కూడా 7 శాతం ఓట్లు వచ్చాయట. శశిథరూర్‌కు 9 శాతం వచ్చాయి. ఇక న్యూస్‌ 24 సర్వేలోనైతే ఎల్‌డిఎఫ్‌ కు 68-72 స్థానాలు వచ్చాయి. యుడిఎఫ్‌ 62-72 సీట్లతో వచ్చింది. బిజెపి కి ఒకటి రెండు వస్తే గొప్ప అని తేలింది. వ్యక్తులుగా చూస్తే విజయన్‌కు 30 శాతం, చాందీకి 22 శాతం ఓట్లు వచ్చాయి.ఈ రెండు సర్వేలు కూడా గత నెలలో జరిపినవే. వాస్తవానికి ఈ సర్వేల కన్నా ముందే నవంబరులో జరిగిన స్థానిక ఎన్నికలలోనే ఎల్‌డిఎఫ్‌ విజయదుందుభి మోగించింది. అయితే సర్వేలను మాత్రమే చూసి సంబరపడబోమని మరింత ఉత్సాహంగా ఎన్నికల పోరాటానికి సిద్ధమవుతామని సిపిఎం నాయకులు విజయరాఘవన్‌, సిపిఐ ఎంపి వినరు విశ్వం స్పష్టంగా ప్రకటించారు. మేము క్షేత్ర స్థాయిలో ప్రజలను కలుసుకుంటామనీ మరోసారి విజయవంతమైన పునరాగమనం కోసం కృషిి చేస్తామని వారన్నారు.
పాత కేసుకు కొత్త ప్రచారం
స్థానిక విజయాలు, సర్వేల సూచికలూ కేంద్రంలో బిజెపికి గంగవెర్రులెత్తించిన ఫలితమే పాతపడిన యుఎఇ స్మగ్లింగ్‌ కేసును మళ్లీ తవ్వి తీయడం. ఇప్పటికి ఆరు మాసాల నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ కేసును పట్టుకుని ఊగులాడుతూనే వున్నాయి. యుఎఇ రాయబార కార్యాలయ మాజీ ఉద్యోగిని స్వప్న సురేష్‌ ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా వుంది. ఆమెకు ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రిన్సిపల్‌ కార్యదర్శిగా వున్న శివశంకర్‌ సహకరించారని ఆరోపణలు రావడంతో వెంటనే తొలగించారు. స్వప్న వాస్తవానికి రాష్ట్ర ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌కు కన్సల్టెంట్‌ మాత్రమే. ఆమెకూ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎలాంటి సంబంధాలు వుండే అవకాశం లేదు. కాకుంటే యుఎఇ రాయబార కార్యాలయంలో పని చేసినప్పుడు వారి తరపున కొన్ని సార్లు రాకపోకలు జరిగాయి. ఆమె సంబంధాలన్నీ రాయబార కార్యాలయ సిబ్బందితోనే. కనుకనే కేసు బయిటకు రాగానే ఏ కేంద్ర సంస్థతోనైనా దర్యాప్తు జరిపించాలని విజయన్‌ స్వయంగా ప్రధానికి లేఖ రాశారు తప్ప దాటవేయలేదు. దాన్ని అవకాశంగా తీసుకుని ఆయన కార్యాలయాన్నే దోషిగా ఇరికించే కుట్ర జరగడంతో తర్వాత ముఖ్యమంత్రి నేరుగానే మళ్లీ ప్రధానికి ఫిర్యాదు చేశారు. తుపాను బాధితుల కోసం తలపెట్టిన లైఫ్‌ మిషన్‌ అనే గృహ నిర్మాణ పథకంలో అవకతవకలు జరిగాయంటూ వివిధ ప్రభుత్వ సంస్థలలో ఇ.డి, సిబిఐ జోక్యం చేసుకుంటుంటే ముఖ్యమంత్రి అధికారికంగా నిరసన తెల్పడమే గాక భవిష్యత్తులో తమ అనుమతి లేకుండా కేంద్ర సంస్థలు రాకూడదని విధాన నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రచారం వల్ల నష్టం కలుగుతుందని కొందరు వ్యాఖ్యానించినపుడు ప్రజలకు నిజాలు తెలుసని వారే ఇందుకు తగు సమాధానం ఇస్తారని ముఖ్యమంత్రి అన్నారు. నిజంగానే స్థానిక ఎన్నికలలో సర్వేలలో వారు సమాధానమిచ్చారు.
శబరిమల నుంచి శ్రీధరన్‌ వరకూ
వాస్తవానికి శబరిమల తీర్పు నాటి నుంచి బిజెపి, సంఘ పరివార్‌లు కేరళలో కాలూనేందుకు వేయని పాచిక లేదు. చేయని దుష్ప్రచారం లేదు.అప్పట్లో భారీగా సనాతనులను సమీకరించి ఏదో మార్పు తెచ్చేసినట్టే భ్రమ పడ్డారు. ఆ తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు పైన కూడా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షా నేరుగా దాడి చేశారు. మత విషయాల్లో జోక్యం చేసుకోవడం ఒప్పుకోబోమని హుంకరించారు. గవర్నర్‌ ఆరిఫ్‌ఖాన్‌ను అడ్డు పెట్టుకుని ప్రభుత్వ నిర్ణయాలకు ఆటంకాలు కల్పించారు, రైతు వ్యతిరేక శాసనాలపై శాసనసభను సమావేశ పర్చకుండా విఘాతం కలిగించారు. చైనా నుంచి కరోనా వరకూ రకరకాల సాకులతో రాజకీయ దుప్ప్రచారాలకు తలపడ్డారు. దురదృష్టవశాత్తూ లౌకిక విలువల రక్షణ కోసం బిజెపి కుట్రలను ఎదుర్కొనవలసిన బాధ్యత గల కాంగ్రెస్‌ నాయకత్వం, నేరుగా రాష్ట్ర ఎం.పి గా వున్న రాహుల్‌గాంధీలు వీటిని ఖండించకపోగా ఎల్‌డిఎఫ్‌పై కత్తి కట్టి వ్యవహరించారు. రాహుల్‌గాంధీ పదేపదే పర్యటిస్తూ అవాకులు మాట్లాడారు. బెంగాల్‌లో సిపిఎంతో కలసి ఉనికి కాపాడుకోవాలని పాకులాడుతున్న ఆ పార్టీ...మరో వామపక్ష పాలిత రాష్ట్రమైన కేరళలో ఆ స్పృహే లేకుండా అధికారం కోసం అన్ని అనౌచిత్యాలకు పాల్పడింది. కొన్ని దారుణమైన హత్యలకూ పాల్పడింది. సామదానభేద దండోపాయాలన్నిటా విఫలమైన బిజెపి తొంభై పడిలో పడిన మెట్రో శ్రీధరన్‌ను తీసుకొచ్చి ఏదో సాధించాలని తాజాగా తాపత్రయపడటం మొదలెట్టింది. ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఆ పైన అవునో కాదో చెప్పలేని అయోమయంలో తనే కూరుకుపోయింది.
బిజెపికే కాంగ్రెస్‌ వంత
సముద్రంలో కొట్టుకుపోయేవారికి గడ్డిపోచ దొరికినట్టు ఈ సమయంలో మళ్లీ పాత స్మగ్లింగ్‌ కేసునే తవ్వితీయడం బిజెపికే చెల్లింది. రాజకీయ ప్రత్యర్థులపై అది కూడా ఎన్నికల సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎలా ఉసిగొల్పి ఉత్తుత్తి ఒత్తిడి చేస్తుంటారో ఈ సరికి దేశమంతా అర్థం చేసుకుంది. ఈ వారం కస్టమ్స్‌ శాఖ న్యాయస్థానంలో ఒక అఫిడవిట్‌ దాఖలు చేయడం అలాటి తతంగమే. తమ కస్టడీలో వున్న స్వప్న సురేష్‌ బంగారు డాలర్ల స్మగ్లింగ్‌లో ముఖ్యమంత్రి, స్పీకర్‌ శ్రీమన్నారాయణ, మరో మంత్రి హస్తం వుందని చెప్పినట్టు ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వారి అదుపులో వున్న నిందితురాలు చెప్పిన మాటలకు విలువెంత అనేది ఒకటైతే ఇన్ని మాసాల తర్వాత కొత్తగా ఆమె చెప్పినట్టు అఫిడవిట్‌ వేయడమేమిటి? ఇది ఒత్తిడితో చెప్పించి రాజకీయ అస్త్రంగానే ఇప్పుడు ముందుకు తెచ్చారనేది ఎవరైనా చెప్పగల విషయం. కొద్దిరోజుల కిందటనే కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ బోర్డ్‌ (కెఐఐఎఫ్‌బి)పై ఇ.డి కేసు నమోదు చేసింది. అది కూడా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాతనే. దీనిపై సిపిఎం పొలిట్‌బ్యూరో వివరమైన ఖండన జారీ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేరళ పర్యటన సమయంలో ఈ బోర్డు పైన, ఎల్‌డిఎఫ్‌ పైన తీవ్ర ఆరోపణలు చేయడమే గాక దాడులు జరగనున్నట్టు కూడా బెదిరించారు. ఇప్పుడు స్వప్న సురేష్‌ పేరిట దాఖలైన అఫిడవిట్‌పై ఎల్‌డిఎఫ్‌ నాయకత్వం స్పందిస్తూ బిజెపి నాయకులు ఏయే నిరాధార ఆరోపణలు చేస్తారో వాటన్నిటినీ కేంద్ర సంస్థలు అధికారముద్ర వేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వప్న సురేష్‌ ఆరోపణల తర్వాతనే స్థానిక విజయాలు సర్వేల ఫలితాలు వచ్చాయని రాజకీయ శత్రువులకు గుర్తు చేసింది. ఎల్‌డిఎఫ్‌ సమావేశంలో కొందరు ఈ అంశాలు లేవనెత్తినపుడు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎవరెన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలకు నిజానిజాలు తెలుసనీ తమ ప్రభుత్వ కృషి వారి ముందుంది గనకే ఆదరిస్తున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. షరామామూలుగా కాంగ్రెస్‌ నాయకులు రమేష్‌ చెన్నితల వంటివారు మహోత్సాహంతో బిజెపి ఆరోపణలు అందిపుచ్చుకుని విజయన్‌ రాజీనామా చేయాలని హడావుడి ప్రారంభించారు. రాజీనామా చేయడం కాదు కదా మరోసారి మరింత గొప్ప ఆధిక్యతతో అధికారంలోకి వస్తామని వామపక్షాలు వారికి సమాధానమిస్తున్నాయి. ఇప్పుడున్న దేశ పరిస్థితులలో కేరళలో మరోసారి వామపక్ష ప్రభుత్వం అధికారంలోకి రావడం ఆ రాష్ట్రానికే గాక దేశమంతటికీ కూడా ఉత్సాహం ఇవ్వడంతో పాటు ఊపిరిపోసే పరిణామం అవుతుంది.

                                                              విజయం దిశగా ఎల్‌డిఎఫ్‌... విష ప్రచారాలతో యుడిఎఫ్‌, బిజెపి...          -  తెలకపల్లి రవి