ప్రజాశక్తి-కలెక్టరేట్, విశాఖ : యువత పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే స్వయంసాధన, కఠోర శ్రమ అవసరమని పోటీ పరీక్షల నిపుణులు, ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు పేర్కొన్నారు. అల్లూరి స్టడీ సర్కిల్ ఆధ్వర్యాన అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో బుధవారం నిర్వహించిన పోటీ పరీక్షల ఇంటరాక్టివ్ సెషన్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక మార్కు సైతం జీవితాన్ని నిర్ధేశిస్తుందన్న విషయం గుర్తెరిగి అత్యధిక మార్కులు కైవసం చేసుకునేలా ప్రణాళికతో సన్నద్ధం కావాలన్నారు. కేవలం పుస్తకాలను బట్టి పట్టడం కాకుండా విశ్లేషనతో చదవాలని సూచించారు. చుట్టూ జరిగే సామాజిక అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. అందుకోసం వార్తా పత్రికల అధ్యయనం చాలా అవసరమని తెలిపారు. సిలబస్‌ను అర్థం చేసుకోవడం, పాత ప్రశ్నాపత్రాలను పరిశీలించడం, పరీక్షకు అనుగుణంగా కాన్సెప్ట్ సిద్ధం చేసుకోవడం ద్వారా విజయానికి చేరువ కావచ్చని చెప్పారు. కొన్ని స్టాండర్డ్ బుక్స్ మాత్రమే అనుసరించి వీలైనన్ని ఎక్కువ రివిజన్‌లు చేయాలని సూచించారు. అనంతరం పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాల జాబితాను విద్యార్ధులకు తెలిపారు. అభ్యర్ధులు అడిగిన సందేహాలకు సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్టడీసర్కిల్ సమన్వయకర్త కె.అభిమన్యు, బోధనా సిబ్బంది డాక్టర్ రామునాయుడు, ఒ.రామకృష్ణ, డాక్టర్ ప్రియాంక విద్యార్థులు పాల్గొన్నారు.










