పార్వతీపురం టౌన్: ప్రతి ఒక్కరూ విజయం సాధించాలంటే అలాంటి వారికి కఠోర శ్రమ అవసరమని జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు అన్నారు. ఆదివారం స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో జరిగిన శ్రీ వాసవి, గాయత్రి విద్యాసంస్థల డిగ్రీ విద్యార్థుల ఫేర్వెల్ ఫంక్షన్‌లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ, అపజయంతోనే విజయం వరిస్తుందన్నారు. ఒకటి రెండుసార్లు అపజయం వస్తే విద్యార్థులు అక్కడితో ఆగిపోకూడదని, తన లక్ష్య సాధన ప్రయత్నాన్ని కొనసాగించాలన్నారు. అపజయం వచ్చేటప్పుడు మనోస్థైర్యంతో ముందుకు వెళ్లాలని, కృంగిపోకూడదని, చిన్న మనసు చేసుకోరాదని, ఎవరు విజయం సాధించినా ఆ విజయం వెనుక కఠోర శ్రమ ఉంటుందనే విషయాన్ని మర్చిపోరాదు అన్నారు. విజయం అంత సులభంగా సిద్ధించదనేది గుర్తెరగాలన్నారు. ప్రతి విద్యార్థి ప్రణాళిక, కఠోర శ్రమ, వ్యక్తిగత క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పాజిటివ్ యాటిట్యూడ్ అనే పంచ సూత్రాలను పాటిస్తే విజయం తథ్యమన్నారు. అలాగే అనుకున్నది జరగకపోతే అధైర్య పడకూడదన్నారు. ఈ సందర్భంగా తన జీవిత ప్రస్థానాన్ని విద్యార్థులకు ఉదాహరణగా వివరించారు. ఉపాధ్యాయ వత్తి నుండి జాయింట్ కలెక్టర్ స్థాయికి చేరే ప్రయాణంలో ఎదుర్కొన్న ఆటుపోటులను విద్యార్థులకు వివరించారు. అపజయం వచ్చేటప్పుడు కొంతమంది ప్రోత్సహిస్తే, కొంతమందే నిరుత్సాహ పరుస్తారని అవేవీ పట్టించుకోకుండా తనకు తానే మనోస్థైర్యంతో ముందుకు సాగాలన్నారు. ప్రస్తుతం అవకాశాలు అధికంగా ఉన్నాయని, ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు విద్యార్థులు శ్రమించాలన్నారు. జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరుకొని కన్న తల్లిదండ్రులకు, చదువు చెప్పే అధ్యాపకులకు, చదువుకున్న విద్యా సంస్థకు చక్కని పేరు తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆ విద్యాసంస్థల కరస్పాండెంట్ పీవీకే మణికుమార్, ప్రిన్సిపాల్స్ ఎంవిఎస్ శర్మ, కళావతి ఎఒలు గౌరీ శంకర్ , శ్రీనివాసరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు..










