Feb 21,2023 21:14

నిరాహార దీక్షలను ప్రారంభిస్తున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.నాగరాజు

విజయ పాల డైరీలో తొలగించిన
కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
- సిఐటియు నేతలు డిమాండ్‌
- కలెక్టరేట్‌ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

      విజయ పాల డైరీలో అక్రమంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, లేనిపక్షంలో విజయ పాల డైరీ చైర్మన్‌ ఛాంబర్‌ ముట్టడిస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ.నాగరాజు హెచ్చరించారు. మంగళవారం స్థానిక కలెక్టర్‌ కార్యాలయం ముందు విజయ పాల డైరీలో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో బాధిత కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్‌ అధ్యక్షత వహించారు. దీక్షలను సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ నాగరాజు ప్రారంభించి మాట్లాడారు. రాయలసీమకే తలమానికంగా ఉన్న విజయ పాల డైరీలో యాజమాన్యం అన్యాయంగా 13 మంది కార్మికులను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించిందని అన్నారు. డైరీ అభివృద్ధి చెందిందంటే కార్మికుల శ్రమ ఉందని, అది మరిచి యూనియన్‌ పెట్టుకుని సమస్యలను పరిష్కారం చేయమని కోరతారనే సాకుతో తొలగించడం దుర్మార్గమన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్‌, డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ అధికారులు జోక్యం చేసుకోని కార్మికులను విధుల్లోకి తీసుకునేలా విజయ పాల డైరీ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులను సమీకరించి పాల డైరీ ముట్టడించేందుకు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. అనంతరం సిఐటియు కడప జిల్లా కార్యదర్శి మనోహర్‌, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు, జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి మహమ్మద్‌ గౌస్‌, కోశాధికారి వెంకటలింగం మాట్లాడారు. కార్మికులు యూనియన్‌ పెట్టుకుంటే హక్కులను కల్పించాలని, వేతనాలు పెంచాలని, సమస్యలను పరిష్కరించాలని అడుగుతారని ముందే డైరీ యాజమాన్యం బెదిరించి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా కార్మికులను నాలుగు నెలల నుంచి రానివ్వకుండా ఇబ్బందులు పెట్టడం దుర్మార్గమన్నారు. యాజమాన్యం నిర్వాకం వల్ల ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయని జిల్లా కలెక్టర్‌కు, లేబర్‌ అధికారులకు చెప్పినా చూద్దామంటున్నారే తప్ప పరిష్కారం చేయడం లేదన్నారు. ఈ నెల 25వ తేదీలోగా అధికార యంత్రాంగం స్పందించకపోతే పాల డైరీ ముట్టడించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దీక్షలలో పాల డైరీ యూనియన్‌ నాయకులు సుబ్బయ్య, నాగప్రసాదు, ఇస్సాక్‌, శేఖర్‌, సుబ్బరాయుడు, కరుణాకర్‌, సుబ్బారావు, దేవరాజు, కిట్టయ్య, ఈశ్వరయ్యలు కూర్చున్నారు.