Jul 28,2021 11:01

చెన్నై : ఇంగ్లండ్‌ నుంచి దిగుమతి చేసుకొన్న రోల్స్‌ రాయిస్‌ కారుకు రాష్ట్ర ఎంట్రీపన్ను మినహాయింపునివ్వాలని కోరిన కోలీవుడ్‌ నటుడు ఇళయ దళపతి విజయ్ కు విధించిన రూ.లక్ష జరిమానా ఉత్తర్వులపై మద్రాసు హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. మిగిలిన 80 శాతం ఎంట్రీ పన్నును వారంలోపు చెల్లించాలని ఆదేశించింది. విచారణలో 'రీల్‌ హీరోలు కాదు.. రియల్‌ హీరోలు కండి' అంటూ న్యాయమూర్తి.. నటుడు విజయ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను, జరిమానాను ఉపసంహరించుకోవాలని నటుడు మద్రాసు హైకోర్టులో అప్పీల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం జస్టిస్‌ దురైస్వామి, జస్టిస్‌ హేమలత ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. దిగుమతి చేసుకున్న కారుకు ఏడు నుంచి పది రోజుల్లో ఎంట్రీ పన్ను చెల్లించేందుకు సిద్ధమని విజయ్ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. జరిమానా, న్యాయమూర్తి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని వాదనలు వినిపించారు. లగ్జరీకారుకు విజయ్ ఎంట్రీ పన్ను చెల్లిస్తే సరిపోతుందని, జరిమానా, వ్యాఖ్యల గురించి మాట్లాడేందుకేమీ లేదని ప్రభుత్వం తరఫున న్యాయవాది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక న్యాయమూర్తి విధించిన జరిమానాపై మధ్యంతర స్టే విధించారు. ప్రత్యేక న్యాయమూర్తి పేర్కొన్న విమర్శలపై నాలుగు వారాల తర్వాత విచారణ నిర్వహిస్తామని సూచిస్తూ కేసును ఆగస్టు 31కి వాయిదా వేశారు.