
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పేదల అభ్యున్నతికి శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని 2024 జరగనున్న ఎన్నికల్లో గెలిపించుకోవాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. శనివారం ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్‌లో గల రెవెన్యూ కళ్యాణ మండపంలో వైసిపి దళితుల ఆత్మీయ కలయిక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈనెల 26 నుంచి తలపెట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్రను విజయవంతం చేయటంలో దళితులు కీలక పాత్ర పోషించాలన్నారు. చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు తప్ప చేసిందేమి లేదన్నారు. విశాఖలో దళిత మహిళను వివస్త్రను చేస్తే చంద్రబాబు కనీసం పట్టించుకోలేదన్నారు. గత ప్రభుత్వ పాలనలో దళితులపై దారుణాలు జరిగితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బిసిల సామాజిక వర్గాల అభ్యున్నతికి పెద్ద పీట వేస్తున్నారని చెప్పారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి జిల్లాలో ఎస్‌కోట, గజపతినగరం, పార్వతీపురం, రాజాం నియోజకవర్గాల్లో జరిగే బస్సు యాత్రలను విజయవంతం చేయాలని అన్నారు. ఎమ్మెల్సీ ఎం.అరుణ్‌కుమార్, వైసిపి ఎస్‌సి సెల్ అధ్యక్షుడు అనిల్‌కుమార్, జూపూడి ప్రభాకరరావు, రాజాం, పార్వతీపురం ఎమ్మెల్యేలు కంబాల జోగులు, అలజంగి జోగారావు మాట్లాడారు.
ఎపి టిడ్కో ఛైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి, ఎస్‌సి సెల్ జోనల్ ఇన్‌ఛార్జి కంబాల సందీప్, ఎస్‌సి సెల్ జిల్లా అధ్యక్షుడు పి.జైహింద్‌కుమార్, జిల్లా కార్యదర్శి రొంగలి పోతన్న, ఎపి టూరిజం డైరెక్టర్ ఆర్.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.