Jul 27,2023 21:36

ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు

ప్రజాశక్తి - పాలకొండ, పాలకొండ రూరల్‌ :  ఏజెన్సీలో అతి సమీపాన పాలకొండ మండలం ఉండడంతో వర్షాకాలం వస్తే వర్షాలు వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇది ప్రతిఏటా షరామూమూలగానే మారింది. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో వ్యాధులు వచ్చాక రోగులు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. పల్లెలతో పాటు పట్టణాల్లోనూ జ్వర పీడితులు సంఖ్య ఎక్కువ అవుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంటింటా వైద్య సేవలందించాల్సిన అధికారులు తూతూ మంత్రం గా సేవలందిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్‌ కేంద్రంలో గల ఏరియా ఆస్పత్రికి రోజుకు 30 నుంచి 40మంది వరకు జ్వరపీడితులు వస్తున్నట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. మండలలోని గల పిహెచ్‌సి ఎం.సింగుపురంలో కూడా అధిక సంఖ్యలో రోగులు జ్వరాలతో వస్తున్నట్టు పిహెచ్‌సి చెబుతున్నారు. గతనెల 2డెంగీ కేసులు, నాలుగు మలేరియా కేసులు, 8 టైఫాయిడ్‌ కేసులు నమోదయ్యాయి.
పెరుగుతున్న డెంగీ కేసులు
కొద్దిరోజులుగా పాలకొండతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. గత నెల ఏరియా ఆస్పత్రిలో 5 డెంగీ కేసులు, 25 టైఫాయిడ్‌ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఈనెల 4 డెంగీ కేసులు నమోదైనట్లు తెలిసింది. ప్రసుత్తం ఆస్పత్రిలో ఏ.పారయ్య, యశోద చికిత్స పొందుతున్నారు. ఆర్థిక స్థోమత ఉన్న వారు ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ఇక్కడ నయం కాని కేసులు శ్రీకాకుళం, విశాఖపట్నం రిఫర్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వ్యాధులను అదుపులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే గ్రామాల్లో పారిశుధ్య మెరుగునకు తక్షణమే చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
పీడిస్తున్న పారిశుధ్య సమస్య
పాలకొండ నగర పంచాయతీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో పారిశుధ్య సమస్య పీడిస్తోంది. జనాభాకు తగ్గట్టుగా పారిశుధ్య కార్మికులు, డంపింగ్‌యార్డులు లేకపోవడంతో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. దీంతో వీధులతో పాటు ప్రధాన రహదారుల్లో చెత్తకుప్పలు ఎక్కడికక్కడ దర్శనమిస్తున్నాయి. నగరం పంచాయతీలోని గురువుగారి వీధి, కోమటిపేట, పట్టువీధి, ఇందిరానగర కాలనీ, గాయత్రీనగర్‌ కాలనీ తదితర చిన్నపాటి వర్షం కురిసిన కాలువల్లోని మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో దోమలబారిన పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సరిపడా పారిశుధ్య కార్మికులను నియమించి, కాలువలను శుభం చేయాలని ప్రజలు కోరుతున్నారు.