Feb 20,2023 23:38

సీలేరులో లంపి వ్యాధి సోకిన ఆవు దూడ

పశువుల మృత్యువాతతో గిరిజనం ఆందోళన
ప్రజాశక్తి -సీలేరు
: ఏజెన్సీలోని పలుగ్రామాల్లో పశువులకు లంపి చర్మవ్యాధి సోకడంతో గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు.జికె. వీధి మండలం సీలేరు, దారకొండల్లో ఇప్పటికే పలు పశువులు ఈ వ్యాధి బారిన పడి మృత్యువాత పడ్డాయని పశువుల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లంపి చర్మవ్యాధి ప్రబలి మూగజీవాలు మృత్యువాత పడుతున్నా, సంబంధిత పశువైద్యశాఖాపరంగా ఎటువంటి చర్యలు లేకపోవడంతో గిరిజనులు వాపోతున్నారు. రాజస్థాన్‌, హరియాణా ప్రాంతాల్లో నాలుగు నెలల క్రితం లంపి చర్మవ్యాధితో అనేక పశువులు మరణించాయని వార్తలు తెలుసుకున్న స్థానికులు, ప్రస్తుతం అదే వ్యాధి మన్యంలోనూ ప్రబలి మూగజీవాలను పొట్టన పెట్టుకుంటుండడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తల్లడిల్లుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించాలని, దారకొండ, సీలేరులతోపాటు ఇతర గ్రామాల్లో లంపి వ్యాధి లక్షణాలున్న పశువులకు సరైన వైద్యసేవలు అందించి వాటి ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు. అదే సమయంలో ఇతర పశువులకు వ్యాధి వ్యాప్తి చెందకుండా అవసరమైన వ్యాక్సినేషన్‌ చేయించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ వ్యాధిపై గిరిజనుల్లో నెలకొన్న అపోహలు, సందేహాలు, ఆందోళనను నివృత్తి చేయడానికి వారికి అవగాహన కల్పించాలని పలువురు సూచిస్తున్నారు.