Sep 26,2023 21:52

ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న జ్వరపీడితులు

ప్రజాశక్తి-శృంగవరపుకోట : ఎస్‌.కోట ఏజెన్సీ ప్రాంతంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోగులతో ఏరియా ఆస్పత్రి కిటకిటలాడుతోంది. ఆస్పత్రికి రోజువారి వస్తున్నరోగుల్లో సగం మంది జ్వరపీడితులే ఉంటున్నారు. ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు రక్త హీనత, రక్తంలో ఇన్‌ఫెక్షన్‌తో జ్వరాల బారిన పడుతున్నారు.
శృంగవరపుకోట మండలంతో పాటు వేపాడ, అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. సాధారణంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో వర్షాలు కారణంగా ఏటా జ్వరాలు వస్తుంటాయి. నీటి నిల్వలు వల్ల దోమలు వృద్ధి చెందడం, నీటి బావుల్లోను, చెరువుల్లోను కొత్తనీరు చేరడంతో మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ వంటి జ్వరాలతో ఆస్పత్రులు కిటకిటలాడుతుంటాయి. ప్రస్తుతం అదేపరిస్థితి నెలకొంది. మండలానికి అనుకొని ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని గ్రామాల గిరిజనులు, శృంగవరపు కోట మండలంలోని దారపర్తి పంచాయతీ పరిధిలోగల 12 గ్రామాలు, మూలబొడ్డవర పంచాయతీ పరిధిలో గల నాలుగు గిరిజన గ్రామాలు, కిల్తంపాలెం పంచాయతీ పరిధిలోగల నాలుగు గిరిజన గ్రామాలు, గంట్యాడ మండలం తాటిపూడి డ్యాం అవతల గల నాలుగు గిరిజన గ్రామాలకు చెందిన జ్వర పీడితులు, బ్లడ్‌ ఇన్‌ఫెక్షన్‌, రక్తహీనతతో బాధపడతున్న వారు ఎక్కువగా ఆస్పత్రిలో చేరుతున్నారు. పలు ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులు జ్వరాలతో ఆస్పత్రిలో చేరి చికిత్సపొందుతున్నారు. జ్వరాలు తగ్గిన తరువాత కూడా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు.

చికిత్సపొందుతున్న విద్యార్థినులు
చికిత్సపొందుతున్న విద్యార్థినులు

వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలి : సిపిఎం
గిరిజన గ్రామాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి మద్దిల రమణ డిమాండ్‌ చేశారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల్లో ఎక్కువగా బ్లడ్‌ ఇన్ఫెక్షన్‌, రక్తహీనత మలేరియా టైఫాయిడ్‌ వంటి వ్యాధులతో చేరుతున్నారని తెలిపారు. వీరంతా ప్రభుత్వ పాఠశాలల్లోనూ, ప్రభుత్వ వసతి గహాల్లోనూ చదువుతున్నవారేనని ఆవేదన చెందారు. పౌష్టిక ఆహారాన్ని సక్రమంగా అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని పిల్లల రక్తహీనత నుండి బయటపడేలా చూడాలని కోరారు.
ఒపిలో 50శాతం జ్వర పీడితులే
గత మూడు నెలల్లో ఆసుపత్రికి వచ్చే ఓపిలలో 50శాతం మంది జ్వరపీడుతలేనని. వీరిలో అధిక శాతం మంది గిరిజన గ్రామాల నుంచి వచ్చిన వారేనని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నీలా తెలిపారు. కరోనా తరువాత వర్షాకాలాల్లో వచ్చే సీజనల్‌ వ్యాధులు వాటి రూపాన్ని మార్చుకుంటున్నాయని తెలిపారు. జ్వరం తగ్గినప్పటికీ కీళ్లనొప్పులు, నీరసం కొద్దిరోజుల పాటు ఉంటున్నాయని అయినప్పటికీ రోగులకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్సను అందిస్తున్నామని ఆమె తెలిపారు