
ప్రజాశక్తి - పరిగి : మండలంలో ఇసుకాసురులు విజృంభిస్తున్నారు. మండలంలోని కాలువపల్లి శివాలయం వద్ద ఇటీవల ఇసుక డంప్ ఏర్పాటు సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఆ సందర్భంలో ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా గతంలో సుమారు 700 టిప్పర్లకు పైగా నిల్వ ఉంచిన ఇసుక జేపీ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ యాజమాన్యం అమ్మకాలకు పాల్పడుతున్నా స్థానిక టిడిపి నాయకులు కనీసం నిలుపుదల చర్యలకు పాల్పడక పోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పరిగి మండల వ్యాప్తంగా 14 పంచాయతీలలో ఇప్పటికే జగనన్న ఇళ్లు800 పైగా మంజూరైనట్లు గతంలో మండల అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం తప్ప రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల ఏర్పాటు ప్రారంభం కాకపోవడం వీటి నిర్మాణాలకు ఇసుక అవసరం లేకపోవడం గమనార్హం. దీనిని దృష్టిలో ఉంచుకొని మండలంలో రెండో విడత జగనన్న ఇంటి నిర్మాణాల ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గు చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మండల వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని వైసిపి నిలబెట్టకోకపోవటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నిర్మాణ పనులను అడ్డంగా ఉంచుకొని పరిగి మండలంలోని జయమంగళీ నది నుండి వేలాది టిప్పర్ల ఇసుకను ఉచిత ఇసుకగా మార్చి జెపి కన్స్ట్రక్షన్ ప్రైవేట్ యాజమాన్యం తరలిస్తూ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. ఇసుక తరలింపును స్థానిక ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు అడ్డుకున్నప్పటికీ పోలీసులు రెవిన్యూ అధికారుల వలయంలో ఈ అక్రమ తరలింపు జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. పేద ప్రజల ఇళ్ల నిర్మాణం కోసం డంప్ చేసిన ఈ ఇసుకను లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేయాలని సిపిఎం మండల కార్యదర్శి లింగారెడ్డి ఈసందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో లబ్ధిదారులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామని హెచ్చరించారు.