ప్రజాశక్తి- డెంకాడ : మండలంలోని పినతాడివాడ, గుణుపూరుపేట గ్రామాల్లో డయేరియా విజృంభించింది. ఈ రెండు గ్రామాల్లోను గత రెండు రోజులుగా సుమారు 70 మంది వరకు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఈనేపథ్యంలో స్థానిక పిహెచ్‌సికి సుమారు 70 మంది వరకు డయేరియా రోగులు తరలివచ్చారు. వీరిలో పిన తాడివాడ గ్రామానికి చెందిన వారే సుమారుగా 60 మంది వరకు ఉన్నారు. పరిస్థితి విషమించిన సుమారు 20మందిరోగులను మెరుగైన వైద్యంకోసం జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించారు. మరో 20 మంది విజయనగరంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. జిల్లా కేంద్రాస్పత్రికి రిఫర్ చేసిన వారిలో మీసాల దుర్గమ్మ, సుమా, ఆవాల రాజు, రిషిత, వాల్లె అప్పయ్యమ్మ, వాల్లె తౌడు, మజ్జి కొండమ్మ, మీసాల వాసు, కె.అప్పల రాజు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన వైద్యాధికారి ఎం.పావని ఆధ్వర్యాన సిబ్బంది ఈ రెండు గ్రామాల్లోను వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇంటింటికీ వైద్య సిబ్బందిని పంపించి డయేరియా రోగులను గుర్తించి వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. బుధవారానికి డయేరియా అదుపులోనికి వచ్చింది. పిన తాడివాడ సర్పంచ్ లెంక లక్ష్మణరావు, కార్యదర్శి జగదీష్ ఆధ్వర్యాన గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టారు. పరిసరాలను శుభ్రపరిచి బ్లీచింగ్ చేయించారు. వాటర్ ట్యాంకులను శుభ్రం చేయించారు. తాగునీరు కలుషితం కావడం వల్లే డయేరియా ప్రబలిందని గ్రామస్తులు అంటున్నారు. ఈనేపథంలో తాగునీటిని పరీక్షకు పంపించారు. డయేరియాతో ఎక్కువ మంది అస్వస్థతకు గురవ్వడంతో రెండు గ్రామాల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ముఖ్యంగా పినతాడివాడ ఒక్కసారిగా 60 మందికి వాంతులు, విరేచనాలు కావడంతో ప్రజలు ఆందోళన చెందారు. మొత్తం మీద వైద్య సిబ్బంది డయేరియాను అదుపులోనికి తీసుకురావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

గుణుపూరు, పినతాడివాడ గ్రామాల్లో నిర్వహించిన వైద్య శిబిరాలను జిల్లా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు సందర్శించారు. డయేరియా రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ప్రజలు డయేరియా బారిన పడకుండా నివారించాలని చెప్పారు. వైద్య శిబిరాలను కొనసాగించాలని ఆదేశించారు. ఆయనతో పాటు డిప్యూటీ డిఎంహెచ్‌ఒ సత్యనారాయణ డిఐఒ అచ్యుతకుమారి, డిఎంఒ మనీ తదితరులు పాల్గొన్నారు.










