Feb 20,2023 00:21

బహుమతులు అందజేస్తున్న శ్రీనివాసరావు

ప్రజాశక్తి-మారేడుమిల్లి: సైన్స్‌పై ఆసక్తి పెంచుకోవాలని జాతీయ బాలలసైన్స్‌ కాంగ్రెస్‌ కాకినాడ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు అన్నారు. జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా సైన్స్‌ పక్షోత్సవాలలో భాగంగా ఆదివారం విబివిఆర్‌ ఛారిటబుల్‌ పౌండేషన్‌ ఆధ్వర్యంలో మండలంలోని దేవరాపల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో సైన్స్‌ క్విజ్‌, వ్యాసరచన, సైన్స్‌ ప్రాజెక్టుల నమూనా ప్రదర్శన పోటీలను నాడు నిర్వహించారు. ఈ పోటీలలో 142 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిధి కేసరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థీ శాస్త్రవేత్తగా ఎదగాలని ఆకాంక్షించారు. సైన్స్‌ పట్ల ఆసక్తి పెంచుకోవాలని, నిజజీవితంలో సంఘటనలను సైన్స్‌తో అన్వయించి, ఆలోచించాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల హెచ్‌ఎం డి.నాగేశ్వరరావు మాట్లాడుతూ పరిశోధనలతోనే దేశపురోభివృద్ధి ముడిపడి ఉందన్నారు. సైన్స్‌ ఉపాధ్యాయులు బి.సూర్యనారాయణదొర మాట్లడుతూ సైన్స్‌ పట్ల ఆసక్తి పెంచడానికి ఇటువంటి కార్యక్రమాలు సహకరిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయులు ఎల్‌.వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు ఎస్‌ కోటేశ్వరరావు, ఎమ్‌ వీరారెడ్డి, వై.సతీష్‌, సి.హెచ్‌ శ్రీనివాస కిరణ్‌, బాలకుమార్‌ పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు.