
ప్రజాశక్తి-గుంటూరు : భారత్‌దేశం వేదికగా జరగబోయే జీ20 సదస్సు ద్వారా భారత్-యూకే మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని ఆఫీస్ ఆఫ్ డీన్ ప్రమోషన్స్ కొలాబరేషన్స్ అండ్ ఫ్యాకల్టీ అఫైర్స్ ఆధ్యర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో విద్యాసంబంధమైన అంశాలతోపాటు, దౌత్యపరమైన అంశాల గురించి వర్సిటీ వీసీ పి.నాగభూషణ్‌తో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా బ్రిటీష్ డెప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్‌తో విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, వీసీ నాగభూషణం, ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంవీ రావు, వివిధ విభాగాల డీన్లు ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గారెత్ విన్ ఓవెన్ మాట్లాడుతూ విద్య, పరిశోధనలతో పాటు సాంస్కతిక మార్పిడి, పరస్పర సహకార అవకాశాల అన్వేషణ వంటి అంశాల గురించి చర్చించామన్నారు. ఉమ్మడిగా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఇరువురి మధ్య భాగస్వామ్యం పటిష్టమవ్వడంతో పాటు విద్యాపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చన్నారు. దీని ద్వారా విద్యార్థులకు, అధ్యాపక సిబ్బందికి అపారమైన ప్రయోజనాలు చేకూరుతాయని వెల్లడించారు. అనంతరం ముఖ్య అతిథిని విజ్ఞాన్స్ యూనివర్సిటీ ప్రతినిధులు సన్మానించారు.